కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నింపిన తుక్కుగూడ జన జాతర సభ
భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు.. ఆకట్టుకున్న రాహుల్ ప్రసంగం
తెలుగులో కాంగ్రెస్ మేనిఫెస్టో.. ‘మార్పు కోసం హస్తం’ పేరుతో ఐదు గ్యారంటీల పత్రం విడుదల
తెలంగాణకు ప్రత్యేకించిన 23 హామీల ప్రకటన వాయిదా..
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తుక్కుగూడలో నిర్వహించిన జనజాతర సభ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇక్కడ్నుంచే ప్రచారభేరి నిర్వహించి, అధికారంలోకి వచ్చిందని.. లోక్‌సభ ఎన్నికల్లోనూ కలసి వస్తుందన్న సెంటిమెంట్ కనిపించింది. ఈ సభకు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. సాయంత్రం 5 గంటల సమయానికి సభా ప్రాంగణం కిక్కిరిసింది.
ముఖ్య అతిథి రాహుల్, ఇతర కీలక నేతల రాక ఆలస్యమైనా.. మంత్రులు, ఇతర నేతలు ప్రసంగిస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. రాహుల్ సభా వేదిక వద్దకు చేరుకున్నాక.. సీనియర్ నేతలు వీహెచ్, జగ్గారెడ్డి, చిన్నారెడ్డి, మంత్రులు సీతక్క, కొండా సురేఖ, పలువురు మహిళా నేతలు ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. అనంతరం రాహుల్ ర్యాంప్‌పై నడుస్తూ అభివాదం చేశారు. తర్వాత ప్రసంగించారు. ఈ సమయంలో కార్యకర్తల నినాదాలతో సభాస్థలి మార్మోగిపోయింది.
రాహుల్ రాక ఆలస్యం..: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం సాయంత్రం 6:15 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ తదితరులు స్వాగతం పలికారు. రాహుల్ వారితో కలసి నేరుగా నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. కాసేపు వారితో భేటీ అయ్యారు. తర్వాత సాయంత్రం 7:15 గంటల సమయంలో తుక్కుగూడ సభావేదిక వద్దకు చేరుకున్నారు. సభ అనంతరం 8:30 గంటల సమయంలో శంషాబాద్‌కు వెళ్లి, ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యారు. సభ తర్వాత సీఎం రేవంత్, మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా సభ జరిగిన తీరు, లోక్‌సభ ఎన్నికల ప్రచార షెడ్యూల్‌పై చర్చించినట్టు సమాచారం.
న్యాయపత్రం విడుదల.. ‘ప్రత్యేక హామీలు’ వాయిదా
జన జాతర సభ వేదికగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను తెలుగులో ‘న్యాయ పత్రం’పేరిట విడుదల చేశారు. ‘మార్పు కోసం హస్తం’పేరుతో ఐదు గ్యారంటీల పత్రాన్ని కూడా విడుదల చేశారు. అయితే.. ఈ సభలోనే తెలంగాణ కోసం 23 హామీలతో రూపొందించిన ప్రత్యేక హామీలను కూడా ప్రకటించాల్సి ఉన్నా.. చివరి నిమిషంలో వాయిదా వేశారు. ఈ హామీలను త్వరలోనే తెలంగాణ ప్రజల ముందుంచుతామని టీపీసీసీ వర్గాలు తెలిపాయి.
తెల్లం వెంకట్రావు రాకపై చర్చ!
జన జాతర సభ వేదికపై భద్రాచలం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కనిపించడం చర్చకు దారితీసింది. ఆయన ఇంకా కాంగ్రెస్‌లో చేరకపోయినా.. సభా వేదికపై కూర్చోవడం గమనార్హం. ఆయనతోపాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆసీనులయ్యారు. వెంకట్రావు, ప్రసాదరెడ్డిలను పలువురు కాంగ్రెస్ నేతలు కలసి అభినందిస్తూ కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment