సాక్షి, న్యూఢిల్లీ : ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో 370 పై చిలుకు స్థానాల్లో నెగ్గాలని బీజేపీ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. అందుకు తగ్గట్లే లోక్‌సభ అభ్యర్ధుల ఎంపికపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గెలుపు గుర్రాల్ని రంగంలోకి దించుతుంది. కేరాఫ్ కాంట్రవర్సీ అభ్యర్ధుల్ని పక్కన పెట్టేస్తోంది.
తాజాగా బీజేపీ విడుదల చేసిన తొలి లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో మొత్తం 33 స్థానాల్లో సిట్టింగ్ ఎంపీలకు టికెట్లను తిరస్కరించింది. కొత్త వారికి అవకాశం కల్పిచ్చింది. వారిలో ప్రగ్యా ఠాకూర్, రమేశ్ బిధూరి, పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మలు ఉన్నారు. ఈ ముగ్గురు ఎంపీలు పార్లమెంటు లోపల, వెలుపల ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. కాబట్టే పార్టీ పెద్దలు కఠిన చర్యలు తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా.
సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్
భోపాల్ నుంచి వివాదాస్పద ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్‌లకు మొండిచేయి చూపింది బీజేపీ. ఆమె స్థానంలో అలోక్ శర్మకు చాన్స్ ఇచ్చింది. సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్‌పై గతంలో అనేక వివాదాలున్నాయి. మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసు,నాథూరామ్ గాడ్సేను దేశభక్తుడు అని వ్యాఖ్యానించడం, 2008 ఉగ్రదాడుల సమయంలో మరణించిన ముంబై ఏటీఎస్ మాజీ చీఫ్ హేమంత్ కర్కరే గురించి చేసిన కామెంట్లు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. ఇలా సాధ్వీ సున్నితమైన అంశాల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కమలం పెద్దలకు ఆగ్రహం తెప్పించింది. ఫలితం లోక్‌సభ సీటును తిరస్కరించింది.
పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ
రెండుసార్లు ఎంపీగా పనిచేసిన మాజీ సీఎం దివంగత సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పశ్చిమ ఢిల్లీ బీజేపీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మకు టికెట్ ఇవ్వలేదు. 2020 ఢిల్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఓ బహిరంగ సభలో ఓ వర్గాన్ని పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఆ వ్యాఖ్యలే ఆయన సిట్టింగ్ ఎంపీ సీటుకు ఎసరు పెట్టాయి.
రమేష్ బిధూరి
లోక్‌సభలో చంద్రయాన్-3 విజయంపై చర్చ సందర్భంగా ఎంపీ డానిష్ అలీపై ఎంపీ దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేష్ బిధూరి అనుచిత, మతపరమైన వ్యాఖ్యలను ఉపయోగించారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఆయన వ్యాఖ్యలను ఖండించాయి. ఎంపీ బిధూరీ వ్యాఖ్యల పట్ల బీజేపీ పెద్దలు నోటీసులు జారీచేసింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పినా ఫలితం లేకపోయింది. చేసిన తప్పుకు మూల్యం చెల్లించుకోక తప్పలేదు. బీజేపీ విడుదల చేసిన తొలి లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో స్థానం కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment