ఢిల్లీ: గాజాపై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా మండిపడ్డారు. గాజా విషయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వ తీరును ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాలని ఆమె ఎక్స్ వేదికగా శుక్రవారం పిలుపునిచ్చారు.
‘ఇజ్రాయెల్ పౌరులు కూడా హింస, ద్వేషాన్ని నమ్మరు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ప్రపంచంలోని అన్ని ప్రభుత్వాలు తీవ్రంగా ఖండించాలి. ఇది ప్రపంచంలోని ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత. ఇజ్రాయెల్ చర్యలు ఆమోదించదగినవి కావు. గాజాలో జరుగుతున్న భయంకరమైన మారణహోమం అందరూ ఖండించాలి. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు అనాగరికం. గాజాపై దాడులను ఇజ్రాయెల్ ప్రధాని అనాగారికత, నాగరికత మధ్య ఘర్షణ అని అంటున్నారు. కానీ, ఆయన, ఆయన ప్రభుత్వమే చాలా అనాగరికమైంది’అని ప్రియాంకా గాంధీ అన్నారు.
గత పది నెలల నుంచి హమాస్ మిలిటెంట్లను ఏరివేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై యుద్దం చేస్తోంది. ఇప్పటివరకు 40 వేల మంది గాజా పౌరులు మృతి చెందారు. ప్రపంచంలోని పలు దేశాలు కాల్పుల విరమణ చేపట్టలాని కోరుతున్నా.. అమెరికా పర్యటనలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం గాజాపై యుద్ధాన్ని సమర్ధించుకోవటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment