
సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలకు పోటెత్తిన ప్రజానీకం
హిందూపురంలో 43 డిగ్రీల ఎండనూ లెక్కచేయని జనం
నియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడికి లేని రీతిలో బ్రహ్మరథం
ఈసారి హిందూపురం వైఎస్సార్‌సీపీదే అంటున్న రాజకీయ పరిశీలకులు
పలమనేరులో వర్షాన్ని కూడా లెక్క చేయని ప్రజలు n నెల్లూరులో జననీరాజనం
సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం హిందూపురం, పలమనేరు, నెల్లూరుల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలకు జనం ప్రభంజనంలా తరలివచ్చారు. ముఖ్యంగా టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటలా నిలుస్తున్న హిందూపురంలో సీఎం జగన్ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభకు సునామీలా జనం కదిలివచ్చారు. ఆ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ ఏ నాయకుడికీ ఈ స్థాయిలో జనస్పందన లభించలేదని రాజకీయ పరిశీలకులు తేల్చిచెబుతున్నారు.
దీన్నిబట్టి చూస్తుంటే హిందూపురంలో ఈసారి ఫ్యాన్ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఢంకా బజాయిస్తున్నారు. ఓవైపు సీఎం జగన్ నిర్వహిస్తున్న ప్రచార సభలకు సునామీలా జనం పోటెత్తుతుండటం.. మరోవైపు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి స్పందనే లేకపోవడంతో కూటమి శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది.
నెల్లూరులో జనసునామీ..
షెడ్యూలు ప్రకారం నెల్లూరులో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం జగన్ ప్రచార సభ ప్రారంభమవుతుందని తెలుసుకున్న ఆ నియోజకవర్గ ప్రజలు గాంధీ విగ్రహం సెంటర్‌కు భారీగా చేరుకున్నారు. తీవ్ర ఉక్కపోతను కూడా లెక్క చేయకుండా రెండు గంటలపాటు నిలబడిన చోట నుంచి కదల్లేదు. సీఎం జగన్ సాయంత్రం 5 గంటలకు ఆ ప్రాంతానికి చేరుకోగానే.. జగన్నినాదాలతో జననీరాజనాలు పలికారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ నినదించారు. సీఎం జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్న జనం.. మంచి చేసిన మిమ్మల్ని గెలిపించుకుని మళ్లీ సీఎంగా చేసుకుంటామని నినదించారు.
జనసంద్రమైన హిందూపురం..
షెడ్యూలు ప్రకారం హిందూపురంలో ఉదయం పది గంటలకు సీఎం జగన్ ప్రచార సభ ప్రారంభమవుతుందని తెలుసుకున్న ప్రజలు.. నియోజకవర్గం నలుమూలల నుంచి ఊళ్లకు ఊళ్లు కదిలివచ్చాయి. దీంతో హిందూపురం జనసంద్రంగా మారింది. సీఎం జగన్ హిందూపురానికి చేరుకునేసరికి మధ్యాహ్నం 12.10 గంటలైంది. మిట్టమధ్యాహ్నం 43 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా లెక్కచేయకుండా వేలాది మంది ప్రజలు అంబేడ్కర్ సెంటర్‌లో నిలబడ్డారు. సీఎం జగన్‌ను చూడగానే ఒక్కసారిగా ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.
పలమనేరులో వర్షంలోనూ చెక్కుచెదరని జనం..
పలమనేరులో షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్ ప్రచార సభ ప్రారంభం కావాలి. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు ఉప్పెనలా వెల్లువెత్తడంతో పలమనేరు జనంతో కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ మధ్యాహ్నం రెండు గంటలకు పలమనేరుకు చేరుకున్నారు. అంతకుముందు పలమనేరులో ఓ మోస్తరు వర్షం కురిసింది.
అయినప్పటికీ వర్షంలోనూ తడుస్తూనే క్లాక్ టవర్ సెంటర్‌లో వేలాది మంది ప్రజలు నిలబడ్డారు. సీఎం జగన్ అక్కడికి చేరుకోగానే సీఎం సీఎం అంటూ నినదించారు. 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించేందుకు సిద్ధమా అని సీఎం జగన్ పిలుపునివ్వగా సిద్ధం సిద్ధం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు.
పేదల చేతిలో పెత్తందారుల ఓటమి ఖాయం
రామోజీ, రాధాకృష్ణ కులగజ్జితో పిచ్చిరాతలు
వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి
నెల్లూరు (దర్గామిట్ట): ఈ ఎన్నికల్లో పెత్తందారుల పక్షాన జతకట్టిన టీడీపీ, జనసేన, బీజేపీలను ఓటనే ఆయుధంతో బంగాళాఖాతంలో కలిపేయడానికి పేదలంతా సిద్ధంగా ఉన్నారని నెల్లూరు వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. నెల్లూరులో శనివారం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు వారి అరాచక బృందం పచ్చి అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నదన్నారు.
ఈనాడు రామోజీ, ఏబీఎన్ రాధాకృష్ణ కులగజ్జితో పిచి్చరాతలు రాస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మరని చెప్పారు. విశాఖపట్నం, విజయవాడ తరహాలో నెల్లూరును అభివృద్ధి చేస్తామని తెలిపారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందజేసేందుకు సచివాలయ , వలంటీర్ వ్యవస్థను జగన్ ప్రవేశపెట్టారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌తో రైతుల భూములు కాజేస్తారని అబద్ధాలు చెబుతున్నారని చెప్పారు.
యూనిఫామ్ సివిల్ కోడ్‌పై ఎన్‌డీఏ కూటమి నేతలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నెల్లూరు రూరల్ అభ్యర్థి, ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుని తలుచుకుంటే కరువు గుర్తొస్తుందన్నారు. నెల్లూరు సిటీ అభ్యర్థి ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ అందరికీ సంక్షేమం అందించిన ఘనత సీఎం జగన్‌దేనన్నారు. ప్రజలు ఆశీర్వదించి వైఎస్సార్‌సీపీని గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment