ఒకప్పుడు రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు వేసేవారు. హాస్య చతురతతో, పంచ్ డైలాగ్‌లతో అందరినీ కడుపుబ్బా నవ్వించారు. ఏదో నాలుగు కామెడీ స్కిట్‌లు చేసుకొని కాలు మీద కాలేసుకొని కూర్చొనే కేరక్టర్ కాదు. స్టాండప్ కామెడీలో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. హాస్యం అంటేనే అంతర్లీనంగా ఆవేదన ఉంటుంది. ప్రజలు పడే ఆవేదన బాగా తెలిసినవాడు. అందుకే అదే రాజకీయాల్లోకి వచ్చి కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవాలని అనుకున్నారు. ప్రజాభిప్రాయంతో ఆమ్ ఆద్మీ పార్టీ సీఎం అభ్యర్థిగా నిలిచారు. పంజాబ్ కోటలో పాగా వెయ్యాలని వ్యూహాలు పన్నుతున్న ఆప్ కరోనా కమ్మేస్తోన్న వేళ భగవంత్ మాన్ ఈ ఎన్నికల్లో ఒక బూస్టర్ షాట్‌లా పని చేస్తారని ఆశల పల్లకీలో విహరిస్తోంది.
►భగవంత్ మాన్ పంజాబ్‌లోని సంగ్రూర్‌లో ఒక రైతు కుటుంబంలో మొహిందర్ సింగ్, హర్‌పాల్ కౌర్ దంపతులకు 1973, అక్టోబర్ 17న జన్మించారు.
►కాలేజీ రోజుల్లో ఉండగానే కామెడీ షోలు చేసేవారు. సునామ్‌లో ఎస్‌యూఎస్ ప్రభుత్వ∙కాలేజీ తరఫున రెండు గోల్డ్ మెడల్స్ గెలిచారు. కానీ నటన మీద మోజుతో డిగ్రీ పూర్తి చేయకుండానే డ్రాపవుట్ అయ్యారు.
►ఇందర్‌ప్రీత్ కౌర్‌ని పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2015లో తన భార్యతో విడాకులు తీసుకున్నారు. పిల్లలిద్దరూ ఇప్పుడు విదేశాల్లో ఉన్నారు.
►నటుడు జగ్తర్ జగ్గీతో కలిసి కామెడీ ఆల్బమ్ చేశారు. జుగ్ను ఖెండా హై అనే టీవీ సీరియల్‌తో తన పాపులారిటీ పెంచుకున్నారు. రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తూ కార్యక్రమాన్ని రక్తికట్టించారు.
►2008లో గ్రేట్ ఇండియా లాఫ్టర్ చాలెంజ్ అనే రియాల్టీ షోలో పాల్గొన్న తర్వాత దేశవ్యాప్తంగా భగవంత్ మాన్ పేరు మారు మోగిపోయింది. జాతీయ అవార్డు లభించిన ‘‘మైనే మా పంజాబ్ దీ’’ సినిమాలో అద్భుతమైన నటనని ప్రదర్శించారు.
►2011లో మన్‌ప్రీత్ బాదల్‌కు చెందిన పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ తీర్థం పుచ్చుకొని రాజకీయ అరంగేట్రం చేశారు. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో లెహ్రా నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు
►2014లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరి సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2 లక్షల పై చిలుకు మెజార్టీతో విజయం సాధించారు
►2017లో అసెంబ్లీ ఎన్నికల్లో అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ బాదల్‌పై ఆప్ భగవంత్ మాన్‌ను నిలబెట్టింది. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. మళ్లీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో సంగ్రూర్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
►2019 జనవరిలో ఆప్ పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
►భగవంత్ మాన్ మద్యం సేవించి పార్లమెంటుకు వస్తారని ఆరోపణలున్నాయి. సహచర ఎంపీలు ఆయన నుంచి వచ్చే మద్యం వాసన భరించలేక ఫిర్యాదులు కూడా చేశారు.
►రెండేళ్ల క్రితం బర్నాలాలో జరిగిన ఒక ర్యాలీలో తాను ఇంక మద్యం జోలికి వెళ్లనంటూ ప్రజలందరి మధ్య ప్రతిజ్ఞ చేశారు.
►లోక్ లెహర్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను విజయవంతంగా నడుపుతూ ప్రజల్లో వారికున్న హక్కులపై అవగాహన పెంచుతున్నారు. కలుషిత నీరు తాగి రోగాలపాలవుతున్న ప్రజలకి సాయపడుతున్నారు
►పంజాబ్‌లో ఆప్ పార్టీలో క్రౌడ్ పుల్లర్‌గా పేరు తెచ్చుకున్నారు.
►ఆప్ సీఎం అభ్యర్థి ఎంపిక కోసం దేశంలో మరే పార్టీ చేయని విధంగా టెలి ఓటింగ్ పెడితే, అందులో ఏకంగా 93శాతం ఓట్లను కొల్లగొట్టారు.
►స్టాండప్ కమెడియన్‌గా పేరు తెచ్చుకున్న భగవంత్ మాన్ పంజాబ్‌లో నెలకొన్న బహుముఖ పోటీలో ఎంతవరకు నిలబడగలరో వేచి చూడాలి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment