సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరిన పుట్టా పురుషోత్తమరెడ్డి
వైఎస్సార్‌సీపీలోకి మాజీ జెడ్పీటీసీ పుట్టా సోదరులు, రిటైర్డ్ డీఎస్పీ వేణుగోపాల్.. సాదరంగా ఆహ్వానించిన సీఎం జగన్
పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీకి భారీ దెబ్బ తగిలింది. 2009 నుంచి ఆ పార్టీలో గట్టి పట్టున్న అమడగూరు మండల మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పుట్టా పురుషోత్తమరెడ్డి, ఆయన సోదరుడు మల్లికార్జునరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన రిటైర్డ్ డీఎస్పీ వేణుగోపాల్‌తో పాటు పలువురు వడ్డెర సామాజికవర్గ నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరారు. సోమవారం వారు పుట్టపర్తి ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డితో కలిసి బత్తలపల్లి మండలం సంజీవపురం వద్ద ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర శిబిరంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
సీఎం జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అమడగూరు మండలంలో పురుషోత్తమరెడ్డికి మంచి సంబంధాలున్నాయి. ఆయన చేరికతో టీడీపీ బలమైన ఓటు బ్యాంకును కోల్పోయినట్లయింది. రిటైర్డు డీఎస్పీ వేణుగోపాల్.. చంద్రబాబు మాటలు నమ్మి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే టికెట్ వస్తుందనే నమ్మకంతో నియోజకవర్గం మొత్తం కలియదిరిగారు. తనను దారుణంగా మోసగించిన చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో తమ సత్తా చూపిస్తామని వేణుగోపాల్ ప్రకటించారు. కొత్తచెరువు మండలం వడ్డెర కులానికి చెందిన పెద్దన్న, వెంకటస్వామి, జనసేన నాయకుడు తిరుపతేంద్ర తదితరులు కూడా సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు.
వైఎస్సార్‌సీపీలోకి హిందూపురం నేతలు
హిందూపురం: హిందూపురం టీడీపీ కీలకనేతలు సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిలో లేపాక్షి మండల టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వి.హనోక్, చంద్రదండు వైస్ ప్రెసిడెంట్ అన్సార్ అహమ్మద్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షుడు నవీన్ నిశ్చల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment