PV Narasimha Rao Birth Anniversary: Telangana Politics BJP VS Congress - Sakshi
Sakshi News home page

Telangana: పీవీ జయంతి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు.. ఇప్పుడు గుర్తొచ్చారా?

Published Wed, Jun 28 2023 3:14 PM | Last Updated on Wed, Jun 28 2023 5:22 PM

 Pv Narasimha Rao Birth Anniversary Telangana Politics BJP VS Congress - Sakshi

మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 102 వ జయంతి సందర్భంగా జాతీయ నేతలతోపాటు తెలుగు రాష్ట్రాల నేతలు ఘన నివాళులు అర్పించారు. శుక్రవారం ఉదయం నెక్లెస్‌రోడ్డులోని పీవీ ఘాట్‌కు వెళ్లి పలువురు నేతలు ఆయన సమాధి వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. దేశానికి పీవీ చేసిన సేవలను సర్మించుకున్నారు.

పీవీ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు. భారతదేశ అభివృద్ధికి అతని దూరదృష్టి గల నాయకత్వం, నిబద్ధత ఎంతో గొప్పదని, మన దేశ ప్రగతికి ఆయన చేసిన అమూల్యమైన సేవలను గౌరవిస్తున్నామంటూ పీవీని ప్రశంసిస్తూ ప్రధాని ట్వీట్‌ చేశారు.

అదే విధంగా పీవీకి కాంగ్రెస్‌ నివాళులు అర్పించింది. పీవీ నరసింహారావు భారత ఆర్థిక వ్యవస్థకు అనేక ఉదారవాద సంస్కరణలను అందించారని పేర్కొంది. నేడు స్వదేశంలో, విదేశాలలో భారతదేశాన్ని పునర్నిర్మించిన విశిష్ట రాజనీతిజ్ఞుడు పీవీకి తాము వినయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నామని ట్విటర్‌ ద్వారా తెలిపింది.

అయితే, కాంగ్రెస్‌పై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్‌కు పీవీ నరసింహారావు ఇప్పుడు గుర్తొచ్చారా? అని బీజేపీ ఐటీ సెల్‌ జాతీయ కన్వీనర్‌ అమిత్‌ మాల్వీయా ప్రశ్నించారు. తెలంగాణలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ట్వీట్‌లు చేశారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా మాజీ ప్రధాని పీవీని కాంగ్రెస్‌ అవమానించిందని గుర్తుచేశారు. పీవీ మరణించిన సమయంలోనూ సోనియా గాంధీ ఆ గొప్ప వ్యక్తిని గౌరవించలేదని మండిపడ్డారు. మాజీ ప్రధాని భౌతిక కాయాన్ని డీల్లీ కాంగ్రెస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో ఉంచేందుకు కూడా అనుమంతిచలేదనే విషయం మర్చిపోకూడదన్నారు.
చదవండి: గవర్నర్‌పై మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు

‘పీవీ అంతిమ సంస్కారాలు నిర్వహించడానికి ఢిల్లీలో స్థలం, స్మారక చిహ్నాన్ని ఇవ్వాలని అతని కుటుంబం కోరింది. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పీవీ దేశ సరళీకరణ, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అయినప్పటికీ కాంగ్రెస్ అతన్ని అవమానించింది. అతని వారసత్వాన్ని తుడిచిపెట్టే ప్రయత్నాలనూ విడిచిపెట్టలేదు.

కానీ ఆయన మరణించిన 10 సంవత్సరాల తర్వాత మోదీ ప్రభుత్వంలో మాజీ ప్రధాని పీవీకి ఢిల్లీలోని ‘రాష్ట్రీయ స్మృతి’లో స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ కూడా తన భారత్ జోడో యాత్రలో హైదరాబాద్‌లోని నరసింహారావు స్మారక చిహ్నం వద్ద నివాళులర్పించడం సముచితమని భావించలేదు. ఎందుకంటే అతను ప్రయాణించిన మార్గంలో రాళ్లు విసిరారు.’ అని అమిత్‌ మాల్వీయా పేర్కొన్నారు.

కాగా, దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా పీవీ నరసింహారావు నిలిచారు. 1957లో శాసనసభ్యుడిగా రాజకీయ జీవితం ఆరంభించిన ఆయన రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రిగానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 1991 నుంచి 1996 వరకు ప్రధానమంత్రి పదవిలో  ఐదేళ్లపాటు దిగ్విజయంగా కొనసాగారు. బహుభాషా కోవిదుడుగా ప్రసిద్ధిగాంచారు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి, కుంటుబడ్డ భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనుడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement