దేశంలో ఎక్కడకు వెళ్లినా ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించిన చర్చలే వినిపిస్తున్నాయి. వీటిలో యూపీలోని రాయ్‌బరేలీ స్థానం పలువురి నోళ్లలో నానుతోంది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని సోనియా గాంధీ ప్రకటించినప్పటి నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించిన రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానం భవితవ్యంపై చర్చలు మొదలయ్యాయి.
కాంగ్రెస్ అధిష్ఠానం పలు దఫాలుగా చర్చలు నిర్వహించిన దరిమిలా పార్టీ రాహుల్ గాంధీని రాయ్ బరేలీ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో రాయ్‌బరేలీలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ప్రస్తుతం ప్రియాంక గాంధీ వాద్రాతో పాటు పార్టీ వ్యూహకర్తల బృందం కాంగ్రెస్‌కు అనుకూలంగా అక్కడి వాతావరణాన్ని సృష్టించే పనిలో బిజీగా ఉంది.
గత ఎన్నికల్లో అమేథీ విజయం తర్వాత రాయ్‌బరేలీపై కన్నేసిన బీజేపీ ఈ స్థానంలోనూ విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే గాంధీ కుటుంబ వారసత్వానికి కంచుకోటగా నిలిచిన ఈ సీటును దక్కించుకోవడం బీజేపీకి సవాల్‌గా మారింది.
గత లోక్‌సభ ఎన్నికల్లో అమేథీని కోల్పోయి, రాయబరేలీకి మాత్రమే పరిమితమైన కాంగ్రెస్‌కు ఇప్పుడు ఈ స్థానాన్ని కాపాడుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది. అందుకే రాయ్ బరేలీ స్థానం నుంచి రాహుల్ గాంధీని పోటీకి దింపాలని కాంగ్రెస్ అధిష్టానం చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం కాంగ్రెస్ పోటీ చేస్తున్న రాష్ట్రంలోని ఇతర 16 స్థానాలపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ నేతలు భావించి ఉంటారని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. రాయ్‌బరేలీలో బీజేపీ అభ్యర్థి దినేష్ ప్రతాప్ సింగ్‌పై రాహుల్ గాంధీ పోటీకి దిగారు.
2009 నుంచి సమాజ్‌వాదీ పార్టీ రాయ్‌బరేలీ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థిని నిలబెట్టలేదు. ఈసారి కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు ఉంది. పలువురు ఎస్పీ నేతలు తమ పార్టీ జెండాలు చేతపట్టుకుని కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని పూర్తి సహకారం అందించారు. కాగా రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మే 20న ఐదవ దశలో రాయ్‌బరేలీ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment