
న్యూఢిల్లీ: కోవిడ్–19 కట్టడిపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం వినాశకరంగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ఈ సమయంలో దేశానికి సరైన వ్యాక్సినేషన్ విధానం అవసరముందన్నారు. ప్రస్తుతం వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును చూస్తే మరింత తీవ్రమైన మూడోవేవ్ ఖాయంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. అనుమానిత కరోనా బాధిత మృతదేహాలు గంగానదిలో తేలియాడుతుం డటంపై రాహుల్.. ప్రధాని మోదీ గంగామాతను రోదించేలా చేశారని ట్విట్టర్‌లో శనివారం వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి, గంగా నదిలో 1,140 కిలోమీటర్ల మేర 2 వేల మృతదేహాలు లభించాయన్న వార్తలను ఆయన ట్యాగ్ చేశారు. తౌటే తుపాను నేపథ్యంలో రాష్ట ప్రభుత్వాలు జారీ చేసిన హెచ్చరికలను పాటిస్తూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని ప్రజలను ఆయన కోరారు. అవసరమైన వారికి సాయం అందించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
గుజరాత్‌లో ఆ 65,805 మరణాలు ఎవరివి?
గుజరాత్ వంటి రాష్ట్రాలు కోవిడ్ మరణాలను తక్కువగా చేసి చూపుతున్నాయంటూ వస్తున్న వార్తలపై కేంద్రం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆ పార్టీ నేతలు పి.చిదంబరం, శక్తిసిన్హ్ సోలంకి మీడియాతో మాట్లాడుతూ..ఈ ఏడాది మార్చి 1 నుంచి మే 10వ తేదీ మధ్యలో 1,23,000 డెత్ సర్టిఫికెట్లు జారీ కాగా, గత ఏడాది ఇదే సమయంలో 58వేల మరణ ధ్రువీకరణ పత్రాలను మాత్రమే యంత్రాంగం జారీ చేసినట్లు గుజరాత్‌లోని 33 జిల్లాల గణాంకాలను బట్టి తేలిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇదే సమయంలో కోవిడ్ మరణాలను కేవలం 4,218గా అధికారికంగా ప్రకటించిందని తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ మరణాలు, జారీ అయిన డెత్ సర్టిఫికెట్ల మధ్య కనిపిస్తోన్న 65,805 వ్యత్యాసంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment