కేసీఆర్‌ దోచుకున్న సొమ్ము కక్కించి ప్రజల జేబుల్లో వేస్తాం  | Rahul Gandhi Fires On CM KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ దోచుకున్న సొమ్ము కక్కించి ప్రజల జేబుల్లో వేస్తాం 

Published Wed, Nov 1 2023 4:33 AM | Last Updated on Wed, Nov 1 2023 4:33 AM

Rahul Gandhi Fires On CM KCR - Sakshi

కొల్లాపూర్‌ సభలో మాట్లాడుతున్న రాహుల్‌

సాక్షి ప్రతినిధి మహబూబ్‌నగర్‌/ సాక్షి, నాగర్‌కర్నూల్‌: డబ్బు, అధికారం, మీడియా సీఎం కేసీఆర్‌ వెంట ఉంటే, కాంగ్రెస్‌ వెంట తెలంగాణ ప్రజలు ఉన్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్‌ కార్యకర్తలు కలసి  ప్రజా తెలంగాణ నిర్మాణం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌లో మంగళవారం కాంగ్రెస్‌ నిర్వహించిన ‘పాలమూరు ప్రజాభేరి’ బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘ఈ రోజు ఇందిరమ్మ వర్ధంతి.

గతంలో మా నాయనమ్మకు అవసరమైనప్పుడు తెలంగాణ ప్రజలు మద్దతు పలికి అండగా నిలిచారు. ఇది నేను జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను. తెలంగాణ ప్రజలు ఉద్యమం చేస్తే సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్ర ఫలితాలు ప్రజలకు అందుతాయనుకుంటే, పదేళ్లలో ఈ రాష్ట్రంలో ఒక్క కుటుంబానికే లాభం చేకూరింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం. ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తాం. కేసీఆర్‌ ప్రజల వద్ద ఎంత దోచుకున్నారో అంతా కక్కిస్తాం. ఆ సొమ్మును ప్రజల జేబుల్లో వేస్తాం..’ అని రాహుల్‌ చెప్పారు.  

బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం ఒక్కటే.. 
‘రాష్ట్రంలోని ప్రజలు బీజేపీకి ఓటేసినా, ఎంఐఎం పార్టీకి వేసినా బీఆర్‌ఎస్‌కు వేసినట్టే. బీఆర్‌ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే. బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసే పని చేస్తున్నాయి. లోక్‌సభలో బిల్లుల విషయంలో బీజేపీకి ఇక్కడి సీఎం పూర్తి మద్దతు ఇచ్చారు. విపక్షాలకు చెందిన అందరు సీఎంలపై సీబీఐ, ఈడీ, విజిలెన్స్‌ దాడులు జరుగుతాయి. కానీ తెలంగాణ సీఎంపై ఎందుకు దాడులు ఉండవో అందరూ గ్రహించాలి. ఇంకొక వైపు బీజేపీకి ఎక్కడ అవసరమో అక్కడ ఎంఐఎం మద్దతు తెలుపుతుంది. ఈ ముగ్గురి లక్ష్యం కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా చేయడమే. కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్‌ను, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తాం..’ అని రాహుల్‌ దీమా వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్‌ బలం పెరగడంతో భయపెడుతున్నారు.. 
‘ప్రస్తుతం ప్రజల తెలంగాణ, దొరల తెలంగాణ మధ్య సమరం నడుస్తోంది. ఒక వైపు సీఎం కేసీఆర్‌ కుటుంబం, మరోవైపు తెలంగాణ యావత్‌ సమాజం ఉంది. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో మనకందరికీ తెలుసు. రాష్ట్రంలో దొరల తెలంగాణ కావాలా? ప్రజల తెలంగాణ కావాలా? అన్నది ప్రజలు నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలం పెరిగిపోయింది. దీంతో పార్టీ శ్రేణులపై కుట్రలు చేస్తూ భయపెడుతున్నారు. కానీ కాంగ్రెస్‌ కార్యకర్తలు పెద్దపులిలా ఎవరికీ భయపడరని నాకు తెలుసు..’ అని చెప్పారు.   

ధరణితో 20 లక్షల మందికి అన్యాయం.. 
‘కాంగ్రెస్‌ ప్రభుత్వాలు దశాబ్దాల కాలంగా ఎన్నో ప్రాజెక్టులు నిర్మించాయి. నాగార్జునసాగర్, జూరాల, సింగూరు తదితర ప్రాజెక్ట్‌లు కట్టాయి. ఆ ప్రాజెక్టులను చూడండి, ఈ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ చూడండి. ఈ ప్రభుత్వం ప్రజల నుంచి లక్షలాది కోట్లను దోపిడీ చేసింది. బ్యారేజీలు, బ్రిడ్జిలు కూలిపోతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద మోసం. మా కాంగ్రెస్‌ ప్రభుత్వం దళితులు, ఆదివాసీలు, గిరిజనులకు భూములు ఇస్తే వాటిని ఇక్కడి సీఎం లాక్కుంటున్నారు. కంప్యూటరైజేషన్‌ పేరుతో ధరణి పోర్టల్‌ ద్వారా భూములను లాక్కునే కుట్రకు తెరలేపారు. ధరణి వల్ల తెలంగాగాణలో 20 లక్షల మందికి అన్యాయం జరిగింది. ఒక కుటుంబానికి, మంత్రులు, ఎమ్మెల్యేలకే లాభం చేకూరింది..’ అని రాహుల్‌ ఆరోపించారు.  

ప్రజల కలలను నెరవేరుస్తాం.. 
‘తెలంగాణ ప్రజల కలలను కాంగ్రెస్‌ ముమ్మాటికీ నెరవేరుస్తుంది.  కర్ణాటక, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ రాష్ట్రాల్లో మేం అధికారంలోకి వచ్చిన వెంటనే, మొదటి కేబినెట్‌ సమావేశంలోనే హామీలు అమలు చేశాం. ఇక్కడ కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,500, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తాం. ప్రతి మహిళ ఉచితంగా బస్సులో ప్రయాణం చేయొచ్చు. ఒక్క రూపాయి ఇవ్వకుండా తెలంగాణ మొత్తం ప్రయాణం చేయొచ్చు. రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి రూ.15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు అందజేస్తాం.

ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కింద రూ.5 లక్షల సాయం చేస్తాం. గృహజ్యోతి స్కీం కింద 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందజేస్తాం. విద్యాభరోసా కింద విద్యార్థుల చదువు కోసం రూ.5 లక్షల కార్డు ఇస్తాం. చేయూత కింద రూ.4,000 పెన్షన్‌ అందజేస్తాం. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల బీమా అమలు చేస్తాం..’ అని రాహుల్‌ హామీ ఇచ్చారు. ఈ సభకు తన సోదరి ప్రియాంకా గాంధీ రావాల్సి ఉన్నా.. జ్వరం కారణంగా రాలేకపోయిందని, అందుకే తాను వచ్చానని చెప్పారు. తెలంగాణతో తమది రాజకీయ బంధం కాదని, కుటుంబ అనుబంధమని పేర్కొన్నారు.   

మనవళ్లు, బంధువుల కోసమేనా మూడోసారి సీఎం? 
తన మనవళ్లు, బంధువుల కోసమే మూడోసారి అధికారం ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్‌ అడుగుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి దుయ్యబట్టారు. కేసీఆర్‌ సీఎం అయ్యాక కొడుకు, అల్లుడిని మంత్రులుగా చేశారని, మూడోసారి ముఖ్యమంత్రి అయితే చేనులో పడి ఇష్టారాజ్యంగా మేస్తారని ఆరోపించారు. కాంగ్రెస్‌ రైతుబంధు ఇవ్వదని ప్రచారం చేస్తున్నారని, అయితే తాము కౌలు రైతులతో సహా ప్రతి ఒక్క రైతుకూ ఏడాదికి రూ.15వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. దుబ్బాక బీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై జరిగిన దాడిని చిల్లర పంచాయతీగా అభివర్ణించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 14 స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న తెలంగాణలో దశాబ్దకాలంగా చుక్క నీరు కూడా అదనంగా ఇవ్వని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని కృష్ణానదిలో ముంచాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ప్రజల సంపదను ప్రజలకు పంచడానికి కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీలను తీసుకొచ్చిందని, మన భవిష్యత్‌ కోసం కాంగ్రెస్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సభలో కాంగ్రెస్‌ రాష్ట్ర ఇన్‌చార్జి మాణిక్‌రావు ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, చిన్నారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, వి.హన్మంతరావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. కాగా అంతకుముందు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రాహుల్‌కు ఠాక్రే, రేవంత్‌ స్వాగతం పలికారు. అనంతరం  హెలికాప్టర్‌లో రాహుల్‌ కొల్లాపూర్‌కు బయలుదేరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement