జైపూర్: రాజస్తాన్ రాజకీయాల్లో పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. జూలై 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేసిన గహ్లోత్ ప్రభుత్వ ప్రతిపాదనను గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా మరోసారి తిరస్కరించారు. మహమ్మారి కరోనా వ్యాప్తిపై చర్చ, రాష్ట్ర ఆర్థిక స్థితి, అత్యవసరంగా చేపట్టాల్సిన బిల్లులు.. తదితర అంశాలపై చర్చించేందుకు అసెంబ్లీని సమావేశపరచాలంటూ ముఖ్యమంత్రి చేసిన వినతి బుట్టదాఖలే అయింది. ఇక అనర్హత వేటుకు గురైన సచిన్ పైలట్ వర్గానికి ఊరట కలిగిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాజస్తాన్ స్పీకర్ సీపీ జోషి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
మరోవైపు... ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడాన్ని తప్పుబడుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను రాజస్తాన్ హైకోర్టు నేడు విచారించనుంది. ఈ క్రమంలో బీఎస్పీ సైతం ఇదే అంశంపై హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమచారం. తాజా పరిణామాల నేపథ్యంలో బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. ఒకవేళ విశ్వాస పరీక్ష అనివార్యమైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలకు ఆమె విప్ జారీ చేయడంతో ఉత్కంఠ మరింత పెరిగింది. (రాహుల్ సేనపై దృష్టి)
కాగా, బీఎస్పీ ఎమ్మెల్యేలను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల సమయంలో ఈ విషయంపై మాయావతి కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించగా.. ఇది స్పీకర్ పరిధిలోని అంశమని.. తాము జోక్యం చేసుకోలేమని ఈసీ స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో బీఎస్పీ జారీ చేసిన విప్ ఏ మేరకు చెల్లుబాటు అవుతుందన్నది కీలకం కానుంది.
ఇక ఢిల్లీ స్థాయిలో బీజేపీ పెద్దల ఒత్తిడితో రాష్ట్ర గవర్నర్ నిర్ణయాలు తీసుకుంటున్నారని సీఎం గహ్లోత్ గవర్నర్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ భేటీ కోరుతూ శుక్రవారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన ధర్నా అనంతరం, ఆరు అంశాల్లో ప్రభుత్వం నుంచి గవర్నర్ వివరణ కోరారు. పూర్తి వివరాలతో మళ్లీ ప్రతిపాదనలు పంపాలని సీఎంకు చెప్పారు. అదే విధంగా మెజారిటీ ఉన్నప్పుడు మళ్లీ నిరూపించుకోవాల్సిన అవసరమేంటని గవర్నర్ ప్రశ్నించారు. దాంతో శనివారం మళ్లీ సమావేశమైన కేబినెట్ ఈనెల 31 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాల్సిందిగా కొత్త ప్రతిపాదన పంపినప్పటికీ గవర్నర్ సోమవారం దానిని తిరస్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment