సాక్షి, చెన్నై : రజనీకాంత్ పార్టీ కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. బెంగళూరు నుంచి చెన్నైకు వచ్చిన ఆయన బుధవారం ముఖ్యనేతలతో భేటీ అయ్యారు. రాఘవేంద్ర కల్యాణమండపంలో పార్టీ ముఖ్య నేతలు అర్జున్‌మూర్తి, తమిళరివి మణియన్‌లతో కూడిన బృందం పార్టీ ప్రకటన కార్యాచరణకు తగ్గ వ్యవహరాలపై దృష్టి పెట్టింది. ఈనెల 31న రాజకీయ పార్టీ ప్రకటన, జనవరిలో పార్టీతో ప్రజల్లోకి అంటూ వ్యూహాలకు కథానాయకుడు రజనీకాంత్ పదునుపెట్టారు.
బెంగళూరులోనే బర్త్‌డేను ఆయన జరుపుకుంటారని వార్తలు వచ్చినా, చివరకు అభిమానుల కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు చెన్నైకు వచ్చేశారు. పోయెస్‌గార్డెన్‌లో ఆయన్ను పార్టీ ముఖ్య నేతలు అర్జున్‌మూర్తి, తమిళరవి మణియన్ బుధవారం కలిశారు. ఈ భేటీ తర్వాత కోడంబాక్కం రాఘవేంద్రకల్యాణ మండపానికి ఆ ఇద్దరు చేరుకున్నారు. అక్కడ రజనీకాంత్ సన్నిహితులతో, మక్కల్ మండ్రం ముఖ్యులతో ఈ నేతల సమాలోచనలో నిమగ్నం కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ: ఆ పార్టీల్లో ప్రకంపనలు
తిరుచ్చినా, మదురైనా..
రజనీకాంత్ పార్టీ ప్రకటనకు వేదికగా తిరుచ్చి లేదా మదురైను ఎంపిక చేయడానికి తగ్గట్టుగా సమాలోచన సాగినట్టు సమాచారం. ప్రస్తుతం కరోనా నిబంధనలు అమల్లో ఉన్న దృష్ట్యా, బహిరంగ సభకు అనుమతి దక్కేనా అనుమానాలు తప్పడం లేదు. అభిమానుల సమక్షంలో పార్టీ ప్రకటన, జెండా ఆవిష్కరణ జరగాలని రజనీ సూచించినట్టు, అందుకు తగ్గట్టుగా వేదికలపై ఈ నేతలు దృష్టి పెట్టి ఉండడం గమనార్హం. పార్టీ రిజిస్టర్ వ్యవహారాలను ఎవరికి అప్పగించాలి, అందుకు అవసరమైన అంశాలపై కూడా దృష్టి పెట్టేలా ఈ సమావేశం సాగినట్టు సమాచారం. మక్కల్ మండ్రం పోస్టర్లలో రజనీ ఫొటో మాత్రమే ఉండాలని, అర్జున్‌మూర్తి, తమిళరవి మణియన్ వంటి నేతల ఫొటోలు వద్దు అన్న సూచన అభిమానులకు వెళ్లినట్టు తెలిసింది.
ఇంటికి భద్రత..
జయలలిత జీవించి ఉన్న కాలంలో పోయెస్‌గార్డెన్ అభిమానులతో కలకలలాడేది. భద్రత కూడా ఆ గార్డెన్ వీధుల్లో కట్టుదిట్టంగానే ఉంటుంది. అయితే, అమ్మలేని పోయెస్‌గార్డెన్ కళ తప్పింది. ఈ పరిస్థితుల్లో రజనీ రాజకీయ ప్రకటనతో మళ్లీ గార్డెన్ వైపు రాజకీయ కళ మొదలైంది. రజనీ కోసం అభిమానుల రాక, ముఖ్యుల రాక పెరుగుతోంది. క్రమంగా ఈసంఖ్య మరింతగా పెరగే అవకాశాలతో గార్డెన్ పరిసరాల్లో భద్రత చర్యలు చేపట్టక తప్పలేదు. రజనీకాంత్ నివాసం, ఆ మార్గంలో çపదుల సంఖ్యలో పోలీసులతో భద్రతను చెన్నై పోలీసు యంత్రాంగం కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment