హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో ఐటీ అభివృద్ధికి పునాది వేసిందే కాంగ్రెస్ అని, కానీ.. చరిత్ర తెలియని వారు తాము ఏదో చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సోమాజిగూడలో కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
‘‘రాజీవ్ విగ్రహాన్ని పెడతామంటే.. కొంతమంది తొలగిస్తామంటున్నారు. ఎవరికైనా చేతనైతే విగ్రహాన్ని ముట్టుకోండి.. వాళ్లను కొట్టి తీరతామంటూ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారాయన. ఆ బాధ్యతను జగ్గారెడ్డికి అప్పగిస్తామని అన్నారాయన. రాజీవ్ విగ్రహం స్థానంలో కేటీఆర్ తన తండ్రి కేసీఆర్ విగ్రహం పెట్టాలని చూస్తున్నారంటూ సంచలన ఆరోపణ చేశారు.
.. ఉద్యమం ముసుగులో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొన్నారు. అలాంటి వాళ్లకా విగ్రహాలు పెట్టేది? అని రేవంత్ ప్రశ్నించారు. అధికారం పోయినా బలుపు తగ్గలేదని, ఆ బలుపును తగ్గించే బాధ్యతను కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి అన్నారాయన. కలలో కూడా నీకు అధికారం రాదు అని కేటీఆర్‌పై మండిపడ్డారు. తొందరలోనే రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని, పండగ వాతావరణంలో ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుందామని కాంగ్రెస్ శ్రేణుల్ని ఉద్దేశించి రేవంత్ వ్యాఖ్యానించారు.
సచివాలయం బయట కాదు..
పది సంవత్సరాల్లో తెలంగాణ తల్లి విగ్రహం గుర్తు రాలేదా? అంటూ బీఆర్‌ఎస్‌ను సీఎం రేవంత్ ప్రశ్నించారు. డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతాం.. అదీ సచివాలయం బయట కాదని, లోపల ఏర్పాటు చేస్తామని అన్నారాయన. బీఆర్ఎస్ నాయకులు ఇష్టమున్నట్టు మాట్లాడితే సామాజిక బహిష్కరణ చేస్తామని హెచ్చరించారు.
దేశ యువతకి రాజీవ్ గాంధీ స్ఫూర్తి
కొంత మంది అమెరికాలో చదువుకుని వచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, ఇండియా ప్రపంచంతో పోటీ పడుతుందని గుర్తించింది రాజీవ్ గాంధీ. దేశంలో విప్లవాత్మకమైన చైతన్యానికి కారణం రాజీవ్ గాంధీ. టెక్నాలజీ మాత్రమే కాకుండా సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి రాజీవ్ గాంధీ. మహిళలకు ప్రాధాన్యం ఉండాలని మహిళా సాధికారతకు అడుగులు వేశారు. దేశ సమగ్రత కోసం రాజీవ్ ప్రాణత్యాగం చేశారు.
ఆ పేరుతో స్పోర్ట్స్ యూనివర్సిటీ
మొన్నీమధ్య జరిగిన పారిస్ ఒలింపిక్స్ లో చిన్న దేశం సౌత్ కొరియా కంటే ఇండియా ప్రదర్శన పేలవంగా ఉంది. అందుకే ఆటగాళ్లను ప్రొత్సహించే దిశగా ప్రయత్నాలు చేస్తాం. 1921 నుండి 1931 వరకు గాంధీ నడిపిన పత్రిక పేరు యంగ్ ఇండియా. అందుకే.. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ త్వరలోనే నెలకొల్పుతాం అని సీఎం రేవంత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment