సాక్షి, హైదరాబాద్: ఓటు కోసం అభ్యర్థులెవరైనా డబ్బులిస్తే తీసుకుని ఓటును మాత్రం సమర్థులకే వేయాలని సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ పిలుపునిచ్చారు. ‘ఓటుకు నోటు’కు వ్యతిరేకంగా అవగాహన కల్పించడంలో భాగంగా తెలంగాణ ఆర్టిస్ట్స్ ఫోరమ్, ప్రెస్‌క్లబ్ హైదరాబాద్, ఫోరమ్ ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్‌ల ఆధ్వర్యంలో రూపొందించిన ‘ఆర్ట్ ఫర్ డెమోక్రసీ’వాల్‌పోస్టర్‌ను రామ్‌గోపాల్ వర్మ మంగళవారం ఆవిష్కరించారు.
సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ...ప్రజలను మేలుకొల్పడంలో పొలిటికల్ కార్టూన్స్ చాలా ప్రభావం చూపిస్తాయన్నారు. నియోజకవర్గంపై పూర్తి అవగాహన ఉండి, అభివృద్ధి, రోడ్లు, విద్య, వైద్యం తదితర అవసరాలను మెరుగుపరిచే అభ్యర్థులనే ఎన్నుకోవాలని ఓటర్లకు సూచించారు. తానెప్పుడూ పొలిటికల్ మేనిఫెస్టో చూడనని, దానిని రూపొందించడం, అమలు చేయడం తెలిస్తే తానే ఓ రాజకీయ నాయకుడిగా మారిపోయే వాడినని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా ’ఆర్ట్ ఫర్ డెమోక్రసీ’లో భాగమైన కార్టూనిస్ట్‌లను ఆర్జీవీ అభినందించారు. వ్యంగ్య చిత్రాలను గీసే వారు ఇంత సీరియస్‌గా ఉంటారని కార్టూనిస్టులను చూశాకే తెలిసిందని చమత్కరించారు. కార్యక్రమంలో కార్టూనిస్టులు శంకర్ (సాక్షి), సుభాని, మృత్యుంజయ, నర్సిం, అక్బర్, వెంకటేశ్ కతుల, రాకేశ్, పి.ఎస్.చారీ, సురేందర్ సముద్రాల, జె.వెంకటేశ్, నివాస్ చొల్లేటి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు, జనరల్ సెక్రటరీ రవికాంత్ రెడ్డి తదితర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment