టీడీపీతో ఒప్పందంతోనే సీఎంపై పవన్‌ విమర్శలు | Ramachandraiah Comments On Pawan Kalyan TDP | Sakshi
Sakshi News home page

టీడీపీతో ఒప్పందంతోనే సీఎంపై పవన్‌ విమర్శలు

Published Tue, Sep 28 2021 4:52 AM | Last Updated on Tue, Sep 28 2021 4:52 AM

Ramachandraiah Comments On Pawan Kalyan TDP - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడాన్ని పవన్‌ కల్యాణ్‌ జీర్ణించుకోలేకపోతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య ధ్వజమెత్తారు. టీడీపీతో పవన్‌ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని సీఎం జగన్‌పై ఇష్టానుసారంగా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం రామచంద్రయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. సినిమా టికెట్ల అంశాన్ని అడ్డుపెట్టుకొని పవన్‌ కల్యాణ్‌ మాట్లాడిన మాటలు, చేష్టలు, ఆయన అపరిపక్వ, అపసవ్య ఆలోచనా విధానానికి, అవగాహనాలేమికి అద్దం పడుతున్నాయన్నారు.

రాష్ట్రంలో సినిమా టిక్కెట్లను ఆన్‌లైన్‌ ద్వారా అమ్మాలని చాలాకాలంగా సినీ పరిశ్రమ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞాపనలు వస్తున్నాయని గుర్తు చేశారు. ఆన్‌లైన్‌ విధానంలో ఉన్న పారదర్శకతను, ప్రేక్షకుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపిందన్నారు. దీన్ని సినీ పెద్దలందరూ బహిరంగంగా స్వాగతించారని గుర్తు చేశారు. అయితే కొందరు మాత్రం బ్లాక్‌ మార్కెటింగ్, అడ్డగోలుగా సినిమాల టిక్కెట్ల ధరల పెంపునకు అడ్డుకట్ట పడుతుందనే దుగ్ధతో సీఎం జగన్‌పై విషం కక్కుతున్నారని విరుచుకుపడ్డారు. 

జనాన్ని పిచ్చివాళ్లను చేయాలనుకుంటున్నాడు
పవన్‌ కల్యాణ్‌ రోజురోజుకు రాష్ట్రంలో న్యూసెన్స్‌ వాల్యూగా తయారయ్యారని రామచంద్రయ్య మండిపడ్డారు. 2014లో జనసేన ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఆయన వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. పైగా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం, విధానాలు అవలంబించడం పవన్‌కు సర్వసాధారణంగా మారిందని ధ్వజమెత్తారు. వామపక్షాలతో చెట్టాపట్టాలేసుకొని.. నెలల వ్యవధిలోనే బీజేపీ గూటికి చేరడం దేశ చరిత్రలో ఎక్కడా తాను చూడలేదన్నారు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని తెలిపే పవన్‌ కల్యాణ్‌ తనను ఎవరూ ప్రశ్నించకూడదని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రజలను పిచ్చివాళ్లను చేయాలని చూస్తున్నాడని చెప్పారు. ఆన్‌లైన్‌ టిక్కెట్‌ విధానం వల్ల ఉండే నష్టాలను వివరిస్తూ ప్రభుత్వానికి ఎందుకు లేఖ రాయలేదని పవన్‌ను నిలదీశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీతో చేతులు కలిపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని విమర్శించారు. తెర మీద హీరోగా, రాజకీయాల్లో విలన్‌గా పవన్‌ నటిస్తున్నాడని మండిపడ్డారు. 2019లో పవన్‌ కల్యాణ్‌కు చెల్లింపులు చేసే విషయంలో స్వయంగా చంద్రబాబు, లోకేశ్‌ మధ్య విభేదాలు తలెత్తాయని టీడీపీ వర్గాలే వెల్లడించిన విషయం ప్రజలు మరిచిపోలేదన్నారు. ప్రజలు పవన్‌ను సరిగ్గా అర్థం చేసుకున్నారు కాబట్టే రెండు చోట్లా ఓడించారన్నారు. సమయం రాగానే మరోసారి ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టడం ఖాయమని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement