ఊపిరి ఉన్నంత వరకు జగన్‌ వెంటే: కాపు రామచంద్రారెడ్డి  | Rayadurg MLA Kapu Ramachandra Reddy Meet CM YS Jagan | Sakshi
Sakshi News home page

ఊపిరి ఉన్నంత వరకు జగన్‌ వెంటే: కాపు రామచంద్రారెడ్డి 

Published Thu, Apr 14 2022 7:52 AM | Last Updated on Thu, Apr 14 2022 7:52 AM

Rayadurg MLA Kapu Ramachandra Reddy Meet CM YS Jagan - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో కాపు కుటుంబం 

డి.హీరేహాళ్‌ (గుమ్మఘట్ట)అనంతపురం జిల్లా: తన ఊపిరి ఉన్నంత వరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి   వెంటే ఉంటానని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సామాజిక సమీకరణల్లో భాగంగా సీనియర్లలో కొందరికి మంత్రి పదవులు దక్కలేదని, అంతమాత్రాన ఎవ్వరూ బాధ పడాల్సిన అవసరం లేదని, అందరికీ సముచిత ప్రాధాన్యత ఉంటుందని సీఎం తెలిపారన్నారు. అన్నీ ఆలోచించి సీఎం తీసుకున్న నిర్ణయం తమకు శిరోధార్యమన్నారు. బుధవారం విప్‌ కాపుతో పాటు ఆయన భార్య కాపు భారతి, కుమారుడు ప్రవీణ్‌రెడ్డి, వియ్యంకుడు భీమవరం శ్రీరామిరెడ్డి ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం జగన్‌ను, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు.

చదవండి: పవన్‌.. వరి ఎలా పండిస్తారో తెలుసా?

అనంతరం కాపు కుటుంబ సభ్యులు అక్కడి విశేషాలను ‘సాక్షి’కి తెలిపారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌కు మంత్రి పదవి రావడం తనకు, కుటుంబ సభ్యులకు ఎంతో సంతోషాన్నిచ్చిందని తెలిపారు. తన స్వస్థలం బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లి అని, అక్కడ కురుబ సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారని, వారితో తనకు సోదర భావం ఉందని గుర్తు చేశారు. ఆ సామాజికవర్గానికి చెందిన ఉషశ్రీ చరణ్‌కు కేబినెట్‌లో చోటు దక్కడం వల్ల కళ్యాణదుర్గం,రాయదుర్గం నియోజకవర్గాలకు మేలు చేకూరే రోజులు వచ్చాయనే సంతోషం తనకు కలుగుతోందన్నారు. 2009 నుంచి వైఎస్‌ జగన్‌ వెంట నడిచానని, తన భవిష్యత్‌ను చక్కదిద్దుతానని ఆయన హామీ ఇవ్వడం ఆనందాన్నిస్తోందని అన్నారు.

అభివృద్ధి కోసం కలసి పనిచేస్తాం 
సీఎంఓ కార్యాలయానికి తాము వెళ్లినపుడు రాయదుర్గం ప్రజలు ఎలా ఉన్నారని అక్కడి వారు అడగడం తనకు కొండంత ధైర్యాన్నిచ్చిందని విప్‌ కాపు అన్నారు. బీటీపీకి నీరిచ్చే అంశంతో పాటు నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిధులు మంజూరు చేయాలని కోరినట్లు వివరించారు. తనకు మంత్రి పదవి రాలేదని వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదన్నారు. సోదరి సమానురాలైన ఉషశ్రీచరణ్‌ మంత్రి అయిన నేపథ్యంలో రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల అభివృద్ధికి కలిసి పని చేస్తామని తెలిపారు. మంత్రి ఉషశ్రీచరణ్‌కు తమ కుటుంబ సభ్యులందరూ ఫోన్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపామన్నారు. త్వరలో ఆమెను కలిసి ఘనంగా సన్మానిస్తామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement