ప్రధాన పార్టీలకు రెబెల్స్‌ బెడద | Rebels To The BJP And The Congress Increased In Uttarakhand | Sakshi
Sakshi News home page

ప్రధాన పార్టీలకు రెబెల్స్‌ బెడద

Published Mon, Feb 7 2022 9:22 AM | Last Updated on Mon, Feb 7 2022 9:31 AM

Rebels To The BJP And The Congress Increased In Uttarakhand - Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు రెబెల్స్‌ బెడద ఎక్కువైంది. కాంగ్రెస్‌ పార్టీకి తొమ్మిది నియోజకవర్లాల్లో తిరుగుబాటు అభ్యర్థులు సవాల్‌ విసురుతూ ఉంటే,  బీజేపీ ఏకంగా పన్నెండు స్థానాల్లో రెబెల్స్‌ను ఎదుర్కొంటోంది. ఇక రెండు పార్టీల్లోనూ అసమ్మతి నేతలు కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.

దీంతో ఆయా స్థానాల్లో విజయావకాశాలు తారుమారు అవుతాయేమోనన్న ఆందోళనైతే నెలకొంది. రెబెల్‌ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిని బుజ్జగించి నామినేషన్లను వెనక్కి తీసుకోవాలని రెండు పార్టీలు ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ 20కిపైగా  స్థానాల్లో పోటీ తప్పేటట్టుగా లేదు. బీజేపీ టికెట్లు ఇవ్వడానికి ముందు సర్వే నిర్వహించి పని తీరు బాగాలేని ఎమ్మెల్యేలని పక్కన బెట్టింది. 

కాంగ్రెస్‌ పార్టీలో కూడా ఆశావహులెందరికో టికెట్‌ లభించలేదు. దీంతో యమునోత్రి, బాజ్‌పూర్, రుద్రప్రయాగ్, సితార్‌గంజ్, రామ్‌నగర్, బాగేశ్వర్, జ్ఞానశాలి, డెహ్రాడూన్‌ కాంట్, కిచా నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ రెబెల్స్‌ బరిలో ఉన్నారు. చివరికి కాంగ్రెస్‌ మాజీ ముఖ్యమంత్రి, ప్రచార కమిటీ అధ్యక్షుడు హరీశ్‌ రావత్‌కి కూడా తిరుగుబాటు అభ్యర్థి తలపోటు తెప్పిస్తున్నారు. రావత్‌ను పోటీకి దింపాలనుకున్న రామ్‌పూర్‌లో టికెట్‌ ఆశించి భంగపడిన రెబెల్‌ అభ్యర్థి రంజిత్‌ రావత్‌ బరిలోకి దిగారు. దీంతో రావత్‌ను రామ్‌నగర్‌ నుంచి లాల్‌కౌన్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి మార్చారు. అప్పటికే అక్కడ సీటు ఖరారు చేసిన సంధ్య దాలకోటికి కాంగ్రెస్‌ టికెట్‌ నిరాకరించడంతో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దిగారు. ఈ పరిణామాలతో రావత్‌కు రెబెల్‌ బాధ తప్పలేదు. ఇక యమునోత్రిలో రెబెల్‌ అభ్యర్థి సంజయ్‌ బోధల్‌ రిషికేశ్‌లో షర్బీర్‌ సింగ్,  రుద్రప్రయాగలో మత్బర్‌ సింగ్‌ ఖండారీలు ఎక్కువ బలంగా ఉండడం కాంగ్రెస్‌లో కలకలం రేపుతోంది.  

బీజేపీలో ఎగుస్తున్న అసమ్మతి జ్వాలలు  
ఇక బీజేపీకి రుద్రపూర్, భింతాల్, కిచా, కుమావూ, ధంతోలి, డెహ్రాడూన్‌ కాంట్, ధర్మపూర్, యమునోత్రి, కర్ణప్రయాగ, చక్రత, ఘనశాలి. కోట్వార్‌లలో తిరుగుబాటు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అంతర్గతంగా నెలకొన్న అసమ్మతి జ్వాలలు కూడా పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాయి. ఈనెల 14న పోలింగ్‌ జరిగే ఉత్తరాఖండ్‌లో సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిపోతూ ఉండటంతో బీజేపీ ఇంకా రెబెల్స్‌ని బుజ్జగించే పనిలోనే ఉంది. బీజేపీ మొత్తం 25 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించింది. ఇంచుమించుగా వారంతా స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడ్డారు. వాటికి తోడు పార్టీలో అంతర్గతంగా ఉన్న అసమ్మతి అభ్యర్థుల విజయావకాశాలను దెబ్బతీస్తుందన్న ఆందోళనలో కమలనాథులున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement