సాక్షి, కరీంనగర్/హుజూరాబాద్: తెలంగాణలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ముగిశాక కూడా చర్చనీయాంశంగా మారింది. శనివారం పోలింగ్ అనంతరం ఈవీఎంలు స్ట్రాంగ్‌రూంలకు చేరాక నేతలు విజయావకాశాలపై ఎవరి లెక్కలు వారు ప్రారంభించారు.కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పోలింగ్ సమయం గతం(ఉ.7గంటల నుంచి సా.5 గం.లవరకు)తో పోలిస్తే ఈసారి రెండు గంటలు అదనంగా రాత్రి 7గంటలకు పెంచారు. ఈ అంశాలన్నీ ఈసారి భారీగా పోలింగ్ నమోదవడానికి దోహపడ్డాయి.
చదవండి: హుజురాబాద్ ఉప ఎన్నిక: అవును.. ఆ ఊళ్లో 95.11 శాతం పోలింగ్
హుజూరాబాద్ ఉప ఎన్నికలో 86.64 శాతం ఓట్లు పోలయ్యాయని ఆదివారం హుజురాబాద్ ఆర్డీవో, ఉప ఎన్నిక రిటర్నింగ్ ఆఫీసర్ రవీందర్‌రెడ్డి ప్రకటించారు. గతంలో ఉప ఎన్నికలో ఎన్నడూ ఇంతటి భారీ పోలింగ్ నమోదవలేదని అన్నారు. భారీగా ఓటింగ్ పాల్గొన్న ఓటర్లను అభినందించారు. కొన్ని గ్రామాల్లో 90 శాతంపైగా పోలింగ్ నమోవడం గమనార్హం. మరోవైపు నవంబరు 2న ఫలితాలు వెల్లడవనున్న నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులు, పార్టీల ఇన్‌చార్జులు ఎన్నిక జరిగిన తీరుపై విశ్లేషణలు ప్రారంభించారు.
పెరిగిన పోలింగ్ శాతం..!
హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి ఈటల రాజేందర్ రాజీనామా అనంతరం రాష్ట్రంలో రాజకీయాలు వేగంగా మారాయి.రాష్ట్ర రాజకీయాలకు, వచ్చే ఎన్నికలకు ఈ ఉపఎన్నిక ఫలితాలను ముడిపెట్టడంతో అంతా ఒక్కసారిగా హుజురాబాద్ వైపు చూడటం ప్రారంభించారు. అక్కడ ఏం జరిగినా, మీడియాలో పతాకశీరి్షకన రావడంతో స్థానిక ఓటర్లతోపాటు తెలుగురాష్ట్రాల ప్రజల్లో రోజురోజుకు ఆసక్తి పెంచింది. శనివారం అంతా అనుకున్నట్లుగానే భారీగా పోలింగ్‌శాతం నమోదైంది. హుజూరాబాద్ (85.66%), వీణవంక (88.66%), జమ్మికుంట (83.66%), ఇల్లందకుంట(90.73%), కమలాపూర్ (87.57%) భారీగా పోలింగ్‌శాతం నమోదైంది.
చదవండి: Huzurabad Bypoll: ఈవీఎం గల్లంతవలేదు
నియోజకవర్గంలో పురుషులు 87.05శాతం ఓటు వేయగా.. మహిళలు 86.25శాతం ఓటేశారు.వాస్తవానికి నియోజకవర్గంలో మహిళల సంఖ్య అధికంగా ఉన్నా.. ఓటు హక్కు వినియోగంలో పురుషులదే పైచేయిగా నిలవడం గమనార్హం. మొత్తం మీద 86.64 % పోలింగ్ నమోదవడం అటు అధికారుల్ని, ఇటు రాజకీయ నేతల్ని ఆశ్చర్యపరిచింది. నియోజకవర్గంలో 2,36,873 మొత్తం మీద 20,5236 మంది ఓటు హక్కు వినియోగించుకోవడం గమనార్హం.
సైలెంట్ ఓటుపై ఇరుపార్టీల ధీమా..
హుజూరాబాద్ ఉప ఎన్నికలో సైలెంట్ ఓట్లు బాగా పడ్డాయన్న ప్రచారం జరుగుతోంది. మొత్తం 30 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. గెల్లు శ్రీనివాస్‌యాదవ్ (టీఆర్‌ఎస్), ఈటల రాజేందర్ (బీజేపీ), బల్మూరి వెంకట్(కాంగ్రెస్)ల మూడు ప్రధాన పార్టీల మధ్య పోటీ నెలకొంది. మిగిలిన ఇండిపెండెంట్లు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ముఖ్యంగా టీఆర్‌ఎస్– బీజేపీల మధ్య ‘నువ్వా–నేనా’ అన్న స్థాయిలో హోరాహోరీగా ప్రచారం, ఓటింగ్ జరిగాయి. దీంతో సైలెంట్ ఓట్లపై ఇప్పుడు విపరీతంగా చర్చ నడుస్తోంది. వీరు ఎవరిపక్షం వహించారన్నదే మిలియన్‌డాలర్ల ప్రశ్నగా మారింది. ఇటు గులాబీనేతలు, అటు కమలనాథులు ఎవరికి వారు సైలెంట్ ఓటు తమకే లాభిస్తుందని క్లెయిమ్ చేసకుంటున్నారు.
ఈవీఎంలు మార్చే అవకాశం లేదు: కరీంనగర్ సీపీ వి.సత్యనారాయణ
హుజూరాబాద్ ఉపఎన్నికకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను మార్చేందుకు అవకాశంలేదని కరీంనగర్ సీపీ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం రాత్రి కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడుతూ... శనివారం రాత్రి పోలింగ్ ముగించుకుని కరీంనగర్‌కు వస్తున్న జమ్మికుంట మండలం కొరటపల్లి, వెంకటేశ్వరపల్లి 160,161,162 పోలింగ్‌బూత్‌లకు సంబంధించిన ఈవీఎంలతోఉన్న బస్సు జమ్మికుంట ఫ్‌లైఓవర్ వంతెన వద్ద టైర్ పంక్చర్ కావడంతో సేప్టీటైర్ అమర్చే క్రమంలో కొంత ఆలస్యమైందన్నారు.
బస్సులో పోలింగ్ సిబ్బందితోపాటు బీఎస్‌ఎఫ్ పోలీసులున్నారని, ఈవీఎంలను బస్సు నుంచి కిందకు దించలేదని తెలిపారు. పనిచేయని వీవీప్యాట్‌ను ఎన్నికల అధికారి సిబ్బంది కారులో నుంచి తీస్తుండగా కొందరు వీడియోలు, ఫొటోలు తీసి ఈవీఎంలను మార్చుతున్నారంటూ సోషల్‌మీడియాలో పోస్టింగ్ చేసి వైరల్ చేసినట్లు చెప్పారు. ఈవీఎంలు, వీవీప్యాట్లను మార్చడానికి ఎక్కడా అవకాశం లేదని, ఐఏఎస్, ఐపీఎస్‌లు కుమ్మక్కైయ్యారంటూ ప్రచారం చేయడం తగదని పేర్కొన్నారు. శనివారం రాత్రి జరిగిన సంఘటనపై సీసీ ఫుటేజీలతో సహా ఎన్నికల కమిషన్‌కు సమగ్ర నివేదిక పంపించినట్లు తెలిపారు. కరీంనగర్ టౌన్ ఏసీపీ తుల శ్రీనివాసరావు, టూటౌన్ సీఐ లక్ష్మీబాబులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment