హుజూరాబాద్/ హుజూరాబాద్ రూరల్: మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వాలు దేశాన్ని, రాష్ట్రాన్ని దోచుకుంటున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను నెరవేరుస్తామని కరీంనగర్ గడ్డమీద సోనియా మాట ఇచ్చారని, పార్టీ నష్టపోయినా మాట తప్పక.. మడమ తిప్పక తెలంగాణ ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు.
వచ్చిన తెలంగాణలో 60 ఏళ్ల ఆకాంక్షలు నెరవేరాయో లేదో ప్రజలు ఆలోచించాలని అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అరవింద్ తెలంగాణ కోసం కొట్లాడలేదని, సుష్మాస్వరాజ్‌ను కలిసి ఒప్పించలేదని విమర్శించారు. ఆనాడు తెలంగాణ ప్రజల బాధను చెప్పి, సుష్మాస్వరాజ్ కాళ్లకు దండం పెట్టి ఆమెను ఒప్పించింది పొన్నం ప్రభాకర్ అని అన్నారు. రేవంత్ హాథ్ సే హాథ్ జోడో యాత్ర బుధవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌కు చేరింది. ఈ సందర్భంగా స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడారు.
బీజేపీ, బీఆర్‌ఎస్‌లు రెండూ ఒక్కటే
ప్రధాని మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని రేవంత్ విమర్శించారు. అధికారంలోకి వస్తే స్విస్ బ్యాంకుల్లోని నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో రూ.15 లక్షలు వేస్తామని తొమ్మిదేళ్లు అయినా 15 పైసలు కూడా వేయలేదని రేవంత్ ఎద్దేవా చేశారు. మోదీ వచ్చాక రూ.400 సిలిండర్ రూ.1,250, రూ.50 ఉన్న డీజిల్ రూ.100 అయ్యిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ అవినీతిపై విచారణకు ఆదేశించాల్సిందిగా ఈటల రాజేందర్ ఇప్పటివరకు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ అవినీతిపై ఎప్పటిలోగా విచారణ చేయించి కేసీఆర్, కేటీఆర్‌ను జైల్లో పెడతారో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ రెండు పారీ్టలు ఒక్కటేనని.. కాంగ్రెస్‌కు నష్టం చేకూర్చేందుకే వేరుగా ఉన్నట్లు నటిస్తున్నారని విమర్శించారు. 24 గంటలపాటు కరెంట్ ఇస్తున్నట్లు టీఆర్‌ఎస్ నాయకులు నిరూపిస్తే వచ్చే ఎన్నికల్లో తాము ఓట్లు అడగమని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదలు ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామని, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, పేదలకు ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల వరకు వైద్యం ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఆడబిడ్డలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment