శామీర్‌పేట్: కేసీఆర్ సీఎం అయ్యాక రాష్ట్రంలో రోజుకు సగటున నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని, రైతు ఏడ్చిన రాజ్యం ఎన్నటికీ బాగుపడదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు తన పదవి, రాజకీయాలే ముఖ్యమని ఆయన ధ్వజమెత్తారు. సోమవారం పీసీసీ ఆధ్వర్యంలో మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలంలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన లక్ష్మాపూర్‌లో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్, టీఆర్‌ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ధరణి పోర్టల్ ప్రారంభించిన మండలంలోనే భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, నేటికీ లక్ష్మాపూర్ గ్రామంలో రైతులకు రైతుబంధు, రైతుబీమా అందడం లేదని పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఉన్న రైతుల సమస్యలు పరిష్కరించలేని కేసీఆర్, పంజాబ్ రైతులను ఆదుకుంటానని వెళ్లడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.2,500 మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తామని, హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న గ్రామాల్లో రైతులు కూరగాయల సాగు చేసేందుకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. జిల్లా మంత్రి మల్లారెడ్డి దున్నపోతుమీద వాన పడ్డ చందంగా వ్యవహరిస్తున్నారని, వేల ఎకరాల పేదల భూములను కబ్జాచేస్తున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మల్లారెడ్డి గుంజుకున్న పేదల భూములను వారికే అప్పగిస్తామని హామీ ఇచ్చారు. సీఎం ఫాంహౌస్‌కు వెళ్లే మార్గంలో రోడ్డు విస్తరణలో ఇల్లు కోల్పోయిన కుమ్మరి ఎల్లమ్మ బాధ్యత తనదేనని, రూ.5 లక్షలతో ఇల్లు నిర్మించి ఇస్తానని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఓబీసీ సెల్ కార్యదర్శి జంగయ్యయాదవ్, మేడ్చల్ నేతలు హరివర్ధన్‌రెడ్డి, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
పంజాబ్ రైతులకు పరిహారం ఇవ్వడం విడ్డూరం
తెలంగాణలో రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వాళ్లను పరామర్శించడానికి ఫాంహౌస్ గడప దాటని సీఎం కేసీఆర్, పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు పరిహారం ఇవ్వడం విడ్డూరంగా ఉందని టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి సోమవారం ట్వీట్ చేశారు. ‘అయిన వారికి ఆకుల్లో కానివారికి కంచాల్లో అంటే ఇదేనేమో!’అని ఎద్దేవా చేశారు. ‘మర్మమేమిటో మన రైతన్నలకు అర్థం కాదనుకుంటున్నారా!’అని ట్విట్టర్ వేదికగా సీఎంను రేవంత్ నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment