సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈనెల 7న కులీ కుతుబ్‌షా మైదానంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సూచన మేరకు ఈనెల 8న మంచిర్యాలలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్ నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అదానీ అక్రమాలపై కాంగ్రెస్‌తోపాటు ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న పోరాటంపై అణచివేత తదితర అంశాలపై చర్చించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఏప్రిల్ నెలలో జై భారత్ సత్యాగ్రహ కార్యక్రమాలపై సమీక్షించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో టీ కాంగ్రెస్ నేతల ప్రచారంపై చర్చించారు. రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కర్ణాటక ఎన్నికలు కాంగ్రెస్‌కు కీలకమని, అక్కడ అధికారంలోకి వస్తే తెలంగాణలోనూ వచ్చినట్లేనని ధీమా వ్యక్తం చేశారు.
ఈనెల 10వ తేదీ నుంచి 25 వరకు తిరిగి తన పాదయాత్ర మొదలవుతుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. గజ్వేల్‌లో లక్షమందితో నిరుద్యోగ నిరసన సభ ఉంటుందని చెప్పారు. జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో మిగిలిన 4 అసెంబ్లీ స్థానాలతో పాటు మెదక్ పార్లమెంట్ పరిధిలో పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వెళ్లే నేతల వివరాలు ఇవ్వాలని, ఏప్రిల్ 25 నుంచి మే 6 వరకు కర్ణాటకలో ప్రచారానికి హాజరు కావాలని నాయకులను కోరారు. ప్రజా గాయకుడు గద్దర్ ఆదివారం గాంధీభవన్‌కు వచ్చి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని కలిశారు. కర్ణాటక ప్రచారానికి తాను కూడా వస్తానని పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్‌ను బర్తరఫ్‌ని చేస్తేనే పేపర్ లీకేజీ కేసు విచారణ సాఫీగా సాగుతుందని, లేకపోతే లేదని చీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్‌పీఎస్‌సీ కమిటీని కూడా రద్దు చేయాలని, పేపర్ లీకేజీపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. టీఎస్‌పీఎస్‌సీ తీగ లాగితే.. ప్రగతి భవన్ లింక్ బయటపడిందని అన్నారు. కాంగ్రెస్ ఫిర్యాదుతోనే ఈ పేపర్ లీక్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment