దిస్పూర్, సాక్షి : లోక్‌సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు తమ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ ప్రచారంలో ఒకేసారి రెండు ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎదురు పడితే ఎలా ఉంటుంది. అచ్చం ఇక్కడా అదే జరిగింది. మరి ఆ తర్వాత ఏమైంది.
అస్సాం దిబ్రూఘర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్, ‘ఇండియా’ బ్లాక్ కూటమి అభ్యర్థిగా లూరింజ్యోతి గొగోయ్ పోటీ చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో తమను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో అస్సాం దిబ్రూఘర్ జిల్లా హల్దీబారి నగర్ థాన్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖోవాంగ్‌లోని హల్దీబారి నఘర్ థాన్ అనే ప్రార్థనా స్థలంలో కలిసి కనిపించారు. అనుకోకుండా జరిగిన ఈ హఠాత్పరిణామానికి ఇరువురు నేతలు ఆశ్చర్యపోయినా అతని మోముపై చిరునవ్వు చిందించారు.
‘నమస్తే అన్నా’..‘బాగున్నావా తమ్మీ’
రాజకీయాల్లో ప్రత్యర్థులు కామన్. పార్టీల మధ్య, నేతల మధ్య కూడా విమర్శలు కామన్. అయితే.. ఇవి హద్దుల్లోనే ఉన్నాయనే సంకేతాలిచ్చారు ఇరు పార్టీల లోక్‌సభ అభ్యర్థులు. నిత్యం నువ్వెంత అంటే.. నువ్వెంత అనుకునే రాజకీయ నాయకులు కాస్త ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. నమస్తే అన్నా అంటే.. బాగున్నావా తమ్మీ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి పుచ్చుకుంటూ క్షేమ సమాచారం గురించి తెలుసుకున్నారు. అంతేకాదు పక్కపక్కనే కూర్చుని టీ తాగుకుంటూ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందంటూ మాట్లాడుకోవడం ఎన్నికల సిత్రాలు స్థానికుల్ని ఆకట్టుకుంటున్నాయి.
విద్యార్ధి సంఘానికి అధ్యక్షులుగా
బీజేపీ అభ్యర్థి సర్బానంద సోనోవాల్, అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ) అధ్యక్షుడు లూరింజ్యోతి గొగోయ్‌లు సీనియర్, జూనియర్. వారిద్దరూ గతంలో అస్సాంలోని పురాతన విద్యార్థి సంఘమైన ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ) అధ్యక్షులుగా పనిచేశారు.
సోనావాల్ మా సీనియరే
‘ఈ సందర్భంగా లూరింజ్యోతి గొగోయ్ మాట్లాడుతూ.. మేం ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మేం ఇక్కడ పనిచేస్తున్నాం. ప్రత్యర్ధులమే అయినా మేం విద్యార్ధి సంఘంలో కలిసి పనిచేశాం. అతను (సోనావాల్‌ని ఉద్దేశిస్తూ) మా సీనియర్ అంటూ సంభాషించారు. కాగా, డిబ్రూగఢ్ నియోజకవర్గంలో మొదటి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment