
సాక్షి, అమరావతి: కుప్పంలో లోకేశ్ మాటలు వింటుంటే ఉత్తర కుమారుని ప్రగల్భాలు గుర్తొస్తున్నాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. వార్డు సభ్యుడిగా కూడా గెలవలేని వ్యక్తి రికార్డు స్థాయిలో సీట్లు గెలిచిన తమ నాయకుడు సీఎం జగన్‌ను విమర్శించడం హాస్యాస్పందంగా ఉందన్నారు.
జగన్ కాలిగోటికి కూడా లోకేశ్ సరిపోడని అన్నారు. చంద్రబాబు కుప్పంలో మూడు రోజులు తిరిగితే ఒక్కరోజు కూడా ఆయన వెనుక వెయ్యి మంది లేరన్నారు. చంద్రబాబు వచ్చి గొడవలు పెట్టి.. దాడులు చేయించడం అందరూ చూశారన్నారు. మంగళగిరిలో ఓడిపోయిన లేకేశ్ ఇప్పుడేదో ఇరగదీస్తానంటూ కుప్పంలో చిందులేస్తున్నారని రోజా మండిపడ్డారు. జగన్‌ను విమర్శించే స్థాయి లోకేశ్‌కు లేదన్నారు.
దాడులు చేస్తే సన్మానిస్తారా?
‘ఎంతసేపు రెచ్చగొట్టే వ్యాఖ్యలు, దాడులు చేయించడం, జగన్‌పై నిందలు వేయించడం తప్ప మీరేం (లోకేశ్, చంద్రబాబు) చేస్తున్నారు. కుప్పాన్ని మున్సిపాల్టీ చేసి రెవెన్యూ డివిజన్‌గా మార్చింది మా జగనన్న. అక్కడి నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందిస్తూ.. జలసిరులు తెస్తోంది మా ప్రభుత్వం.
ఇది చూసే స్థానిక ఎన్నికల్లో కుప్పం ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఇక మహిళ అని కూడా చూడకుండా ఎంపీపీ అశ్వినీపై దాడి చేసిన మీపై కేసులు పెట్టకుండా సన్మానిస్తారా? జగన్ సంక్షేమాన్ని తట్టుకోలేకే.. మీ తండ్రి మూడేళ్లుగా కుప్పానికి పరుగులు పెడుతున్నారు.’ అని రోజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment