
నగరి: ప్రతిపక్ష నాయకులు జగనన్న కాలనీలను వీక్షిస్తే ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏంటో కనిపిస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల, క్రీడాశాఖ మంత్రి ఆర్కే రోజా చెప్పారు. తిరుపతి జిల్లా, నగరి మునిసిపల్ పరిధి నాగరాజకుప్పం వద్ద ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన జగనన్న కాలనీలో శరవేగంగా జరుగుతున్న నిర్మాణాల్లో భాగంగా 108 ఇళ్లకు స్లాబ్ వేసే కార్యక్రమాన్ని సోమవారం ఆమె ప్రారంభించారు. దేశంలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా పేదవాడి సొంతింటి కలను ఏపీ సీఎం వైఎస్ జగన్ సాకారం చేస్తున్నారని తెలిపారు.
నగరి మునిసిపాలిటీ నాగరాజకుప్పంలో 1,248 ఇళ్లు కాంట్రాక్టర్ ద్వారా నిర్మిస్తుంటే.. వాటిలో ఇప్పటికే 420 ఇళ్లకు స్లాబ్‌లు పూర్తయ్యాయని, ఇప్పుడు మరో 108 ఇళ్లకు స్లాబ్ వేస్తున్నారని చెప్పారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మొదటి దశలో 7,580 ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని, రూ.13.64 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో జగనన్న కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయని తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏం చేసిందంటూ ఏసీ రూమ్‌లో పచ్చ పత్రికలకు ఇంటర్వ్యూలిచ్చేవారంతా జగనన్న కాలనీలకు వచ్చి చూస్తే అర్థమవుతుందని చెప్పారు.
ప్యాకేజీలకు ప్లేటు తిప్పే వ్యక్తి పవన్‌కల్యాణ్
ఉత్తరాంధ్ర తమకు పరిపాలన రాజధాని కావాలని కోరుతుంటే.. దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు వైజా గ్‌కి వచ్చి.. తనను చంపడానికి ప్రయత్నించారన్నది నిజం కాదా అని మంత్రి రోజా ప్రశ్నించారు. పవన్ అరైవల్‌లో దిగితే.. అక్కడ ఉండాల్సిన జనసేన నాయకులు డిపార్చర్ వద్ద ఎందుకున్నారని ప్రశ్నించారు. అక్కడ రాళ్లు, రాడ్లు పెట్టుకుని దాడి చేయాల్సిన అవసరమేంటని ధ్వజమెత్తారు.
పక్కా ప్రణాళిక ప్రకారమే అక్కడికొచ్చి దాడి జరిపించారని విమర్శించారు. జనవాణి చేసిన చోట ఎక్కడా ర్యా లీ చేయని పవన్.. వైజాగ్‌లోనే ఎందుకు ర్యాలీ చేశారని ప్రశ్నించారు. పవన్ ఫ్యాన్స్ అని చెప్పుకొనే కొందరు సైకోలకు, వారి తల్లిదండ్రులకు కూడా మంచి చేసేది జగనన్నే అన్న విషయాన్ని తెలుసుకోవాలని హితవుపలికారు.