సాక్షి, మైలవరం: వర్షాలు ఆగగానే రోడ్ల మరమ్మతులు, నిర్మాణం చేస్తామని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పినా కూడా పనీపాటా లేని టీడీపీ నాయకులు మాట్లాడడం తగదని మైలవరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. టీడీపీ జూలో రకరకాల జంతువులతో ఏదేదో మాట్లాడిస్తున్నాడు అని చంద్రబాబు తీరుపై మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డిపై ఓ పందికొక్కు విమర్శలు చేస్తోందని ఎద్దేవా చేశారు.
ఈ రెండేళ్లలో 1,883 కిలోమీటర్ల తారు రోడ్ల నిర్మాణం జరిగిందని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ తెలిపారు. టెండర్లు పూర్తయ్యాయని.. అయితే వర్షాకాలంతో పనులు ప్రారంభం కాలేదని చెప్పారు. టీడీపీ హయాంలో రోడ్లు వేసి ఉంటే ఈ రెండున్నర ఏళ్లలోనే ఇంత పెద్ద గుంతలు పడ్డాయా? అని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి స్థాయి ఏమిటో మీ నాయకుడికి బాగా తెలుసు ఆయన గురించి మాట్లాడే స్థాయి, అర్హత టీడీపీలోని వారెవ్వరికీ లేదని స్పష్టం చేశారు. అలా మాట్లాడిస్తే నీ స్థాయే దిగజారుతుందనేది చంద్రబాబు గుర్తించాలని హితవు పలికారు. రోడ్లు బాగున్నాయని మేము చెప్పడం లేదు.. కానీ కరోనాతో టెండర్లు సకాలంలో పూర్తి కాలేదని తెలిపారు. దీంతోపాటు వర్షాకాలంతో పనులు ప్రారంభం కాలేదని వివరించారు. రూ.7,500 కోట్లతో రహదారులను ఏడాదిలో పూర్తి చేస్తామని అప్పటి పంచాయతీరాజ్ మంత్రిగా చెందిన ప్రబుద్ధుడి వల్లే ఈ గోతులు పడ్డాయని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment