సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడు కలలు మాత్రమే కంటుంటారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభివృద్ధి పనులు చేసి చూపిస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆధారాలు లేకుండా సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ మేరకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మాట్లాడుతూ.. చంద్రబాబు అబద్దాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. సీఎం జగన్‌పై నమ్మకంతో ప్రజలు అఖండ మెజారిటీని ఇచ్చారని గుర్తు చేసిన సజ్జల, రెండున్నరేళ్లుగా జరుగుతున్న అన్ని ఎన్నికల్లో పలితం ఒకే విధంగా వస్తోందని తెలిపారు.
కుప్పంలో టీడీపీ అడ్రస్ లేకుండా పోయిందని, వచ్చే ఎన్నికల్లో ఆ స్థానంలో టీడీపీ తమ అభ్యర్థిని మార్చాల్సిన పరిస్థితి తలెత్తిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు శాపనార్థాలతో రాష్ట్రానికి ఏం ప్రయోజనం లేదన్నారు. జూమ్ కాన్ఫరెన్సులు చంద్రబాబుకి రోజువారీ దినచర్యగా మారిందని, సెల్ ఫోన్ల దగ్గరి నుంచి బిల్ క్లింటన్ వరకు అన్నీ మాట్లాడుతూ ఉంటారని సజ్జల చురకలు వేశారు. చంద్రబాబు తప్పులు చేయబట్టే జనం దండం పెట్టి ఆయన్ని పాలన నుంచి సాగనంపారని గుర్తు చేశారు. ప్రజలు నన్ను ఎందుకు నమ్మటం లేదని చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆయన హితవు పలికారు.
చదవండి: విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
‘టీడీపీ కార్యకర్తల్లో కూడా నిస్తేజం పోనివ్వలేకపోయాడు. ఢీ అంటే ఢీ అనే వారికి టిక్కెట్లు అంటున్నారు. మరి కుప్పంలో స్థానిక ఎన్నికలలో ఓటమి చెందినందున మిమ్మల్ని మీరు మార్చుకోండి. అన్నక్యాంటీన్లు, రంజాన్ తోఫా, ఇతర కానుకలు తీసేశామన్నారు. అన్నిటిలోనూ విపరీతంగా అవినీతి చేసి దోచుకున్నారు. గల్లీ రాజకీయాలు చేయటం చంద్రబాబుకు అలవాటు. ప్రజల కోసం ఇది చేస్తామని గట్టిగా చెప్పుకుని జనంలోకి వెళ్లలేని వ్యక్తి చంద్రబాబు. జనం చంద్రబాబుని నమ్మటం లేదని ఆయనకు కూడా తెలుసు. ధైర్యంగా ఎన్నికలకు వెళ్లలేడు కాబట్టే ఎప్పుడూ ఎవరివో ఊతకర్రలు పెట్టుకుని వెళ్లటమే ఆయన పని’అని ప్రతిపక్షనేత చంద్రబాబుపై సజ్జల విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment