సాక్షి,అమరావతి: అధికారం చేపట్టిన ఏడాదిన్నరలో కోవిడ్ కారణంగా 9 నెలల పాటు రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని పథకాలు, హామీలను అమలు చేశారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. విపత్తు సమయంలోనూ రాష్ట్రంలో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఆగలేదని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నిత్యం కుట్రలు, కుతంత్రాలతో తన జీవిత చరిత్రను తానే ముగించుకుంటున్నారని వ్యాఖ్యానించారు. నాయకుడు ఎలా ఉండకూడదో, ఏం చేయకూడదో ఆయన్ను చూసి నేర్చుకోవచ్చన్నారు. కోవిడ్ సమయంలో చంద్రబాబు లాంటి నాయకుడైతే హామీలన్నింటికీ ఎగనామం పెట్టేవారని చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో సజ్జల శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
బాబు పగటి కలలు..
వంచన రాజకీయాలకు చంద్రబాబు చిరునామా అయితే ప్రజా నాయకుడు వైఎస్ జగన్ అని సజ్జల పేర్కొన్నారు. దూరదృష్టికి దివంగత వైఎస్సార్, సీఎం జగన్‌లే నిదర్శనమన్నారు. అధికారాన్ని తన గుప్పిట్లో, పార్టీ చేతిలో కాకుండా క్షేత్రస్థాయికి తీసుకెళ్లిన ఘనత సీఎం వైఎస్ జగన్‌దని చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ నేతల ప్రవేయం లేకుండా లబ్ధిదారులకు చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. 700 మంది బీసీలకు పదవులు ఇచ్చి సీఎం జగన్ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారన్నారు. గ్రాఫిక్స్‌తో మోసగించిన చంద్రబాబు నకిలీ దార్శనికుడని, అమరావతి ఒక భ్రమ అయితే పోలవరం ఆయనకు ఏటీఎం అయిందన్నారు. గతంలో విజన్ 2020 అని చెప్పి ఇప్పుడు విజన్ 2050 అంటూ పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ‘సీఎం జగన్ లాంటి వ్యక్తో, లోకేశ్ లాంటి వారో 2050 అని చెబితే ఓ అర్థం ఉంటుంది. 70 ఏళ్లు నిండిన వ్యక్తి వందేళ్లు ప్రజలకు సేవ చేయడం సాధ్యమా?’ అని ప్రశ్నించారు. దివంగత వైఎస్సార్‌పై టీడీపీ చేసిన దుష్ప్రచారాలు అన్నీ ఇన్నీ కావన్నారు. వైఎస్సార్ ఆదర్శవంతమైన పాలన అందించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని చెప్పారు.
జీఎస్టీ వసూళ్లు 26 శాతం పెరుగుదల..
టీడీపీ ఎన్ని అభాండాలు వేస్తున్నా సీఎం జగన్ తన పరిపాలన ద్వారా తనేమిటో నిరూపిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో రైతులను ఆదుకునేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద రూ.3000 కోట్లతో నిధి ఏర్పాటు చేశారని, రైతులకే కాకుండా మిగిలిన వర్గాలకు నగదు బదిలీ ద్వారా రూ.80 వేల కోట్ల మేర నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే జమ చేశారని తెలిపారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా తల్లులు, రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేశారన్నారు. ఇదంతా తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి రావటంతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ పాజిటివ్‌గా ఉందని తెలిపారు. 2019తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 26 % పెరిగాయని వివరించారు. ఈనెల 9న అమ్మఒడి కింద తల్లులకు ఆర్థిక సాయం అందచేయనున్నట్లు చెప్పారు.
కోటికిపైగా కుటుంబాలకు లబ్ధి..
రాష్ట్రమంతా ఇళ్ల స్థలాల పంపిణీ పకడ్బందీగా జరుగుతోందని, అర్హత ఉన్నవారిలో ఒక్కరు కూడా మిగలకూడదనే లక్ష్యంతో పంపిణీ చేపట్టామని సజ్జల తెలిపారు. స్థలాలతో పాటు ఇళ్లను కూడా నిర్మిస్తున్న ఏకైక ప్రభుత్వం ఇదేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోటికిపైగా కుటుంబాలు పలు పథకాలతో లబ్ధి పొందుతున్నాయని వివరించారు. పాలనా వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని చెప్పారు. విగ్రహాలను ధ్వంసం చేసిన నిందితులను త్వరలోనే పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
విపత్తులోనూ సంక్షేమం ఆగలేదు
Published Sat, Jan 2 2021 3:54 AM | Last Updated on Sat, Jan 2 2021 9:13 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment