సాక్షి, అమరావతి: ‘అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్నవి భిన్నాభిప్రాయాలే. విభేదాలు ఎంతమాత్రం కాదు’అని ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తెలంగాణలో పార్టీ విస్తరణను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరుకోవడం లేదని తెలిపారు. అయితే అక్కడి అభిమానుల కోసం పార్టీ పెట్టాలన్నది షర్మిల మనోభీష్టమని విశ్లేషించారు. వారి మధ్య వేర్వేరు వాదనలున్నా అవి వ్యక్తిగత సంబంధాలపై ప్రభావం చూపబోవన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలివీ..
రాష్ట్రం కోసమే పార్టీ విస్తరణ వద్దన్నారు
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోనూ వైఎస్సార్ సీపీ విస్తరణ కోసం ఒత్తిడి వచ్చింది. కానీ దీనివల్ల రాష్ట్రానికి నష్టమని వైఎస్ జగన్ భావించారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తెలంగాణాలో వైఎస్సార్‌సీపీ విస్తరణకు విముఖత వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునేవి, పరిష్కరించుకునే అంశాలున్నాయని జగన్ చెప్పారు. తెలంగాణలో రాజకీయాలు చేస్తే ప్రతి దాన్నీ రాజకీయ కోణంలోనే చూసే వీలుందని, పార్టీ విస్తరణ వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు ఆటంకంగా ఉంటుందని, అందువల్ల వద్దని జగన్ స్థిరమైన అభిప్రాయం వెలిబుచ్చారు. తెలంగాణలో పార్టీ విస్తరణ ఆలోచన ఇప్పట్లో వైఎస్సార్ సీపీకి లేదు. ఈ విషయంలో జగన్ ఆలోచనల్లో ఇప్పటికైతే మార్పు లేదు.
కష్టనష్టాల గురించి చెప్పారు
ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలోనూ వైఎస్‌ఆర్ అభిమానులున్నారని, అక్కడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని షర్మిల అనుకుంటున్నారేమో! అందుకే పార్టీ ఆలోచన వచ్చి ఉండొచ్చు. పార్టీ స్థాపిస్తే వచ్చే కష్టనష్టాలు, లాభనష్టాలు, ఆటుపోట్లు చూసిన వ్యక్తిగా సాదక బాధకాల గురించి జగన్ చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తెగా షర్మిల గుర్తింపు పొందిన మహిళ. ఆమెకు భిన్నాభిప్రాయాలున్నాయి. అందుకే తన ఆలోచనతో ముందుకెళ్తున్నారు.
ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు అవసరం
సంక్షేమానికి ప్రజలు పట్టం కట్టడం వల్లే మునుపెన్నడూ లేనంత ఎక్కువగా పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవాలయ్యాయి. ఇది తెలిసే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఏదో జరుగుతున్నట్లుగా చిత్రీకరించే యత్నం చేశారు. రాజ్యాంగ పరిధి దాటి వ్యవహరించిన నిమ్మగడ్డ తీరును చూసిన తర్వాత రాష్ట్ర ఎన్నికల కమిషన్‌లో సంస్కరణలు అవసరమని భావిస్తున్నాం. కమిషన్‌లో మల్టీ మెంబర్ విధానం ఉండాలనే దిశగా అడుగులేస్తున్నాం. దీనిపై జాతీయ స్థాయిలో చర్చిస్తాం.
జగన్‌కు తెరవెనక రాజకీయాలు తెలియవు
తెలంగాణలో పార్టీ విస్తరణ వల్ల తనను నమ్ముకున్న రాష్ట్ర ప్రజలకు నష్టం జరుగుతుందని, ఈ ప్రయత్నం వద్దనేది జగన్ స్థిరాభిప్రాయం. తాను తెలంగాణలో పాదయాత్ర చేశానని, అక్కడ ప్రయత్నిస్తాననేది షర్మిల అభిప్రాయం. మా పార్టీ లైన్ దాటి వెళ్తే.. వేరే పార్టీ పెడితే ఆమె గుర్తింపు వేరు. రాజకీయ అంశాలపై అప్పుడు వ్యక్తుల మధ్య కాకుండా పార్టీల మధ్య చర్చలుంటాయి. అంతేకానీ షర్మిల పార్టీ పెడితే మద్దతిస్తారా? అని ప్రశ్నించడం సరికాదు. ఆమె ఇంకా పార్టీ పెడుతున్నట్టు ప్రకటించనే లేదు. టీఆర్‌ఎస్‌కు మద్దతుగా షర్మిలతో పార్టీ పెట్టిస్తున్నారనే కథనాల్లో నిజం లేదు. వైఎస్ జగన్ సూటిగా ఉండే వ్యక్తి. తెరవెనుక రాజకీయాలు చేసే నైజం లేదు.
పదవుల గురించి విభేదాలనేది అపోహే
అన్నా చెల్లెళ్ల మధ్య విభేదాల్లేవు. ఎలాంటి వ్యక్తిగత స్పర్థలు లేవు. వైఎస్సార్‌సీపీని విస్తరించాలా? వద్దా? రెండు రాష్ట్రాల్లో ఉండాలా? వద్దా? రాష్ట్రానికి ఒనగూరే లాభనష్టాలు ఏమిటనే అంశాలపై ఇద్దరి మధ్య భిన్నమైన, స్థిరమైన, సుస్థిర అభిప్రాయాలున్నాయి. వైఎస్ జగన్ అభిప్రాయాల్లో ఎలాంటి మార్పు లేదు. షర్మిలకు నచ్చజెప్పే ప్రయత్నాలు జరిగాయి. కష్టాలు, నష్టాలు, పరిమితులు వివరించి నివారించే ప్రయత్నం గట్టిగానే జరిగింది. మాలాంటి వాళ్లు కూడా సలహాలిచ్చాం. వైఎస్ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుకునే ఉంటారు.
షర్మిల స్థిరాభిప్రాయంతోనే నిర్ణయం తీసుకుని ఉంటారు. తన నిర్ణయాలకు, ఫలితాలకు ఆమే బాధ్యురాలవుతారు. అంతేకానీ జగన్, షర్మిల మధ్య వ్యక్తిగత సంబంధాలకు, ఈ పరిణామాలకు ఎలాంటి సంబంధాలు లేవు. షర్మిలను వైఎస్ జగన్ ప్రతీ సందర్భంలోనూ భాగస్వామిగా చేశారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆమె అంత పెద్ద పాదయాత్ర చేశారు. పదవుల విషయంలో వైఎస్ కుటుంబంలో వివాదాలొస్తాయనేది హాస్యాస్పదం. ఈ కారణంగానే ఆమె పార్టీ పెడతారనేది అపోహే. ప్రజల్లోకెళ్లి కష్టపడ్డ ప్రతీ ఒక్కరినీ గుర్తించి నాయకులను చేస్తున్న వైఎస్ జగన్ సొంత చెల్లెలి విషయంలో అన్యాయం చేశారనే ప్రచారం అవాస్తవం. ఒకవేళ అందరికీ పదవులిస్తే ఇదే మీడియా కుటుంబ పార్టీ అని ప్రచారం చేయదా?
Comments
Please login to add a commentAdd a comment