సాక్షి, అమరావతి : ఆంద్రప్రధేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కొందరు పెట్టిన అక్రమ కేసులు.. కోర్టులు, బెయిల్ గురించి భారతీయ జనతా పార్టీ నేతల వ్యాఖ్యలు చూస్తే బాధ్యత కలిగిన రాజకీయ పార్టీ నేతలు మాట్లాడినట్లుగా లేవని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కోర్టుల నుంచి వారికి ముందే సమాచారం ఉందా.. ఎలా ఆ విధంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. కేసుల గురించి మాట్లాడాల్సి వస్తే, రాజకీయ నేతలందరి గురించి మాట్లాడాల్సి వస్తుంది’ అని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్‌పై మోపిన కేసులన్నీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని, పెట్టిన కేసులేనని చెప్పారు. ప్రజలు వాటిని పూర్తి స్థాయిలో తిరస్కరించారన్నారు. ఈ కేసులతో సంబంధం లేని ఒక వ్యక్తి బెయిల్ రద్దు చేయండని వెళ్తే.. దాని గురించి టీడీపీ, బీజేపీ, జనసేన వంటి పార్టీలు మాట్లాడుతున్నాయని తెలిపారు. ఇవన్నీ చూస్తుంటే టీడీపీ, బీజేపీ, జనసేన కలసి పని చేస్తున్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని పేర్కొన్నారు.
టీడీపీ–బీజేపీ.. మధ్యలో పిల్ల ఏజెంట్ జనసేన
టీడీపీ వాళ్లు ఉదయం మాట్లాడిన మాటలను బీజేపీ వాళ్లు మధ్యాహ్నానికి అందుకుంటున్నారని చెప్పారు. వారిద్దరి మధ్య పిల్ల ఏజెంట్ లాగా జనసేన పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ నేతలు జీవీఎల్ కావచ్చు.. సోము వీర్రాజు కావచ్చు.. టీడీపీ ఏజెంట్లుగా బీజేపీలో ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్లు మాట్లాడే ముందు తాము కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నామన్న సంగతి గుర్తెరిగి మాట్లాడాలని హితవు పలికారు. ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని ఎప్పుడూ నిందించలేదన్నారు. కలసి పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని సీఎం జగన్ భావిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర నేతలు పోలవరం నిధులు వేగంగా వచ్చేలా చూసి, ఆ క్రెడిట్ వారే తీసుకోవచ్చని చెప్పారు. అలా కాకుండా దిక్కుమాలిన ఆరోపణలతో సమాజాన్ని మత, కుల పరంగా చీల్చాలని చూస్తే కచ్చితంగా విమర్శలు చేస్తామని స్పష్టం చేశారు.
అంతా పారదర్శకం
రాష్ట్రం అప్పుల గురించి బీజేపీ నేతలు కాకిలెక్కలు చెబుతూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. కోవిడ్ వల్ల ఆర్థిక కష్టాలు అంతటా ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తున్నామని చెప్పారు. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్, మరి కొన్ని రాష్ట్రాలు, కమ్యూనిస్టులు రూల్ చేస్తున్న కేరళలో కూడా వారి జనాభాతో పోలిస్తే అప్పులు చాలా ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. జగన్ సీఎం అయ్యే నాటికి ఎంత అప్పు ఉందనేది బీజేపీ నేతలు తెలుసుకోవాలన్నారు. కేంద్రం ఎన్ని అప్పులు చేసిందనే విషయం బయటకు తీసి మాట్లాడాలని కోరారు. పులిచింతల పాపం పూర్తిగా చంద్రబాబుదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టుల్లో ఏం జరిగేది మీకు ముందే తెలుసా?
Published Sun, Aug 8 2021 2:42 AM | Last Updated on Sun, Aug 8 2021 2:42 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment