వికృత రాజకీయాల కోసం కోర్టులను వేదికలుగా చేసుకుంటారా? | Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

వికృత రాజకీయాల కోసం కోర్టులను వేదికలుగా చేసుకుంటారా?

Published Tue, Oct 12 2021 5:07 AM | Last Updated on Tue, Oct 12 2021 7:12 AM

Sajjala Ramakrishna Reddy Comments On Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు కింద సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓ మహాయజ్ఞంలా చేపట్టిన ఇళ్ల నిర్మాణ పథకాన్ని.. అడ్డుకునేందుకు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆపార్టీ నేతలు న్యాయస్థానాల్లో తప్పుడు పిటిషన్లు వేయించి కుట్రలు పన్నుతున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తమ వికృత రాజకీయాలకు టీడీపీ నేతలు న్యాయస్థానాలను వేదికలుగా వాడుకోవడం బాధాకరమన్నారు. ప్రజాక్షేత్రంలో సీఎం వైఎస్‌ జగన్‌తో తలపడలేక.. న్యాయస్థానాలను అడ్డుపెట్టుకుని టీడీపీ వికృత రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటమేరకు నేషనల్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఎన్‌బీసీ) నిబంధనల ప్రకారం అత్యున్నత ప్రమాణాలతో, మౌలిక సదుపాయాలతో ఇళ్లు నిర్మించి పేదల సొంతింటి కలలను సీఎం వైఎస్‌ జగన్‌ సాకారం చేస్తారని స్పష్టం చేశారు. టీడీపీని ప్రజలు ఇప్పటికే చెత్తబుట్టలో వేశారని, దుర్భిద్ధితో ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంటే ఆపార్టీకి జనం పుట్టగతులు లేకుంండా చేస్తారని చెప్పారు. తీర్పుపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో సవాల్‌ చేస్తామని, న్యాయం గెలుస్తుందని పేర్కొన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

భవిష్యత్‌ అవసరాలకు ఉపయోడపడేలా..
గతంలో మాదిరిగా ఇంటి స్థలం డీ–పట్టాగా కాకుండా, యాజమాన్య హక్కులు ఇచ్చి, తర్వాత అమ్ముకోవడానికి, మార్టిగేజ్‌ చేయడానికి ఈ ప్రభుత్వం వీలు కల్పించింది. తమ ఆస్తిగా వాడుకోవడానికి వీలుకల్పిస్తూ, అందులోనూ మహిళల పేరుమీదే ఇళ్ల పట్టాలు ఇచ్చాం. గతంలో పిచ్చుకగూళ్ల తరహాలో ఊరికి దూరంగా, కనీస సదుపాయాలు కల్పించకుండా నిర్మించడంతో నివాసయోగ్యంగా ఉండేవి కావు. అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయని అప్పట్లో మీడియాలో వార్తలు చూశాం. ఇప్పుడు ఈ ఇళ్లను కాలనీలుగా కాకుండా.. 17 వేల ఊళ్లుగా నిర్మిస్తున్నాం. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ, అండర్‌ గ్రౌండ్‌ విద్యుత్‌ వ్యవస్థతోపాటు అంతర్గత రహదారులు, తాగునీటి సౌకర్యం వంటి అన్ని సదుపాయాలు ఉండేలా ఆధునిక గ్రామాలుగా నిర్మిస్తున్నాం. ఈ మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32 వేలకోట్లు కేటాయించి, ఇప్పటికే దాదాపు రూ.10 వేలకోట్లు ఖర్చుచేశాం.

అనేక రాష్ట్రాలకన్నా ఎక్కువ విస్తీర్ణంలో..
చంద్రబాబు హయాంలో కేవలం 224 చదరపు అడుగుల్లో ఇళ్ల నిర్మాణం చేపడితే.. సీఎం వైఎస్‌ జగన్‌ 340 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అనేక రాష్ట్రాల్లో కన్నా ఎక్కువగా 31.725 చదరపు మీటర్లలో ఇళ్లు నిర్మిస్తున్నాం. ఎన్‌బీసీ నిబంధనలు పాటిస్తూనే జాతీయ ప్రమాణాలకు మించిన రీతిలో ఇళ్ల నిర్మాణం చేపట్టాం. అయినా పర్యావరణ కారణాలు చూపి టీడీపీ కోర్టును ఆశ్రయించడం విడ్డూరంగా ఉంది.  టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు మనుషులు ఉండటానికి పనికిరావు. ఆ ఇళ్లల్లో అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయా.. లేక ఇప్పటి ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగతంగా నిర్మిస్తున్న ఇళ్లల్లో ప్రమాదాలు జరుగుతాయా? కేంద్ర ఆరోగ్య, పర్యావరణ, గృహనిర్మాణశాఖలు సమష్టిగా ఆమోదించిన తర్వాతే ఈ ఇళ్లు నిర్మిస్తున్నాం. అవాస్తవాలు చూపుతూ ప్రభుత్వాన్ని పలుచన చేయడం కోసం ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకోవడానికి టీడీపీ చేసిన ఈ కుట్రలను ప్రజలంతా గమనించాలి. మేధావులు, విజ్ఞులు కూడా ఖండించాలని కోరుతున్నాం.

మత రాజకీయాలు చేయడం సరికాదు
బద్వేల్‌ ఉప ఎన్నికలో ప్రజల తీర్పుపై మాకు సందేహం లేదు. సీఎం వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లలో చేపట్టిన మంచిపనులు ప్రజల్లోకి వెళ్లాయి. దానివల్ల మంచి ఫలితమే వస్తుంది. టీడీపీ కూడా పోటీలో ఉంటే బాగుండేది. పోటీలో ఉన్న బీజేపీకి జనసేన మద్దతు ఇస్తోంది. రాష్ట్రంలో హిందువులకు అన్యాయం జరిగిపోతోందని బీజేపీ నేత సునీల్‌ధియోధర్‌ మాట్లాడుతున్నారు. మా ప్రభుత్వానికి అన్ని మతాలు, కులాలు సమానమే. చేతనైతే సీఎం జగన్‌ చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో లోపాలు ఎత్తిచూపితే బాగుంటుందిగానీ మత రాజకీయాలు చేయడం, అప్పుల గురించి మాట్లాడటం సరికాదు. మరి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న అప్పుల మీద మాట్లాడరెందుకు? ఎందుకు బీజేపీకి ఓటు వేయాలో ఆ పార్టీ వాళ్లను చెప్పమనండి.

ప్రపంచ వ్యాప్తంగా బొగ్గు కొరత
ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడింది. ధర పెరిగిపోయింది. అధికధరకు బొగ్గు కొనుగోలు చేయాల్సి వస్తోంది. బొగ్గు కొరతతో విద్యుత్‌ ఉత్పత్తిపై ప్రభావం పడుతోంది. పీక్‌ అవర్స్‌లో గృహ వినియోగదారులు విద్యుత్‌ వాడకాన్ని నియంత్రించుకుంటే బాగుంటుందని కోరుతున్నాం. బొగ్గు కొరత లేదని కేంద్రమంత్రి చెబుతున్న దాంట్లో వాస్తవం లేదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం ఇది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల వల్లే ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి కొంత ఆలస్యమవుతోంది. ఆ పరిస్థితిని ఉద్యోగసంఘాలు కూడా అర్థం చేసుకుని సహకరిస్తున్నాయి.  

కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణం
దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు సీఎం వైఎస్‌ జగన్‌ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. తొలిదశలో 15.60 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తర్వాత భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టింది సీఎం వైఎస్‌ జగనే. ఇళ్ల నిర్మాణానికి హైకోర్టు తీర్పు ద్వారా పెద్ద దెబ్బ తగిలింది. సొంతింటి కలలు సాకారమవుతాయనుకున్న సమయంలో.. ఆ ఆశలు ఆవిరయ్యేలా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై పేదలు ఆందోళన చెందుతున్నారు. పేదల ఇళ్ల నిర్మాణంపై పిటిషన్లు వేసినవారు.. ఆ పిటిషన్లతో తమకు సంబంధం లేదని, తాము అసలు పిటిషన్లు వేయలేదని ముందుకు రావడం చూస్తుంటే.. కొన్ని రాజకీయ శక్తులు దుష్ట పన్నాగాలతో తెరవెనుక ఉండి వికృతక్రీడకు తెరతీసినట్లు భావించాల్సి వస్తోంది. టీడీపీ, ఆపార్టీ అధ్యక్షడు చంద్రబాబే ఈ కుట్ర వెనుక ఉన్నారని నమ్ముతున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement