సమావేశంలో మాట్లాడుతున్న సజ్జల
బద్వేలు అర్బన్: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికలు పవిత్రమైన కార్యక్రమమని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. వైఎస్సార్ జిల్లా బద్వేలులో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ కన్వీనర్లు, ముఖ్యనేతల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ద్వారా అధికార, ప్రతిపక్షాలకు ప్రజల వద్దకు వెళ్లే అవకాశం వస్తుందన్నారు. అధికారంలో ఉన్న వారికైతే తాము ఏం చేశామో, ఇంకా ఏం చేయబోతున్నామో వివరించేందుకు, ప్రతిపక్షాలకైతే అధికారపక్షం లోటుపాట్లను ఎత్తిచూపి ఒకవేళ తాము అధికారంలో ఉంటే ఏం చేస్తామో చెప్పేందుకు అవకాశం ఉంటుందని వివరించారు.
పేదల జీవితాలు మెరుగుపడాలనే ఉన్నత ఆశయంతో ప్రతి పథకానికి ఒక సమగ్ర స్వరూపం రూపొందించి ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. ప్రతిపక్షాలు ఇబ్బందులు పెడుతున్నా, మరోవైపు కోవిడ్ కష్టకాలంలో కూడా ఇచ్చిన హామీలన్నింటిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేరుస్తున్నారని చెప్పారు. తప్పుడు విషప్రచారాలను తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ఉప ఎన్నికలో ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలును వివరించాలని సూచించారు. పోటీలో ఎవరు ఉన్నా, లేకున్నా మన ప్రచారం, ఎన్నిక కార్యక్రమం సాగాలని చెప్పారు.
సీఎం జగన్‌కు బద్వేలు నియోజకవర్గ ప్రజలు అండగా ఉన్నారని నిరూపించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ సుధను భారీ మెజార్టీతో గెలిపించాలని, ప్రతిఒక్కరు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. పోలింగ్ శాతం పెరిగేందుకు ఓటర్లను చైతన్యపరచాలని కోరారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు నారాయణస్వామి, అంజాద్‌బాషా, మంత్రి, ఉప ఎన్నిక బాధ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మంత్రి ఆదిమూలపు సురేష్, కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment