ఫ్యాక్షనిస్టులా నిమ్మగడ్డ శైలి | Sajjala Ramakrishna Reddy Comments On Nimmagadda Ramesh | Sakshi
Sakshi News home page

ఫ్యాక్షనిస్టులా నిమ్మగడ్డ శైలి

Published Thu, Jan 28 2021 5:31 AM | Last Updated on Thu, Jan 28 2021 5:36 AM

Sajjala Ramakrishna Reddy Comments On Nimmagadda Ramesh - Sakshi

సాక్షి అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పరిధి దాటి వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుట్రలో నిమ్మగడ్డ సూత్రధారిగా మారారని చెప్పారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిన ఆయన అధికారులపై దుందుడుకుగా దాడికి సిద్ధమయ్యారని, ఇది ఫ్యాక్షనిస్టు ధోరణిని తలపిస్తోందని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ‘కుట్రలు, కుయుక్తుల్లో నిమ్మగడ్డ, చంద్రబాబుది ఒకే డీఎన్‌ఏ. పదవి ముగిసేలోగా రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చడమే నిమ్మగడ్డ, చంద్రబాబుల ఎత్తుగడ. ప్రభుత్వ సిబ్బందిని భయపెట్టడం, ఎన్నికల విధులు నిర్వర్తించకుండా చేయడం, చంద్రబాబుకు మేలు చేయడమే నిమ్మగడ్డ లక్ష్యం. దీంతోపాటు తానే సర్వాధికారిగా వ్యవహరించి, చంద్రబాబునాయుడు అప్పజెప్పిన కుట్రపూరిత విధులను నిర్వర్తించడమే నిమ్మగడ్డ లక్ష్యంగా కనిపిస్తోంది. గ్రామాల్లో ఆరని కుంపట్లు రాజేయడం, ప్రభుత్వంపై బురదజల్లడం, అధికారుల్లో అభద్రతా భావం సృష్టించడమే ఆయన ఆలోచనగా స్పష్టమవుతోంది.

భయం పుట్టించడమే ఎత్తుగడ
ఇక్కడ మరో కుయుక్తి కూడా కనిపిస్తోంది. అదేంటంటే.. ఏం చేస్తే ఏమవుతుందోనని భయపడే విధంగా ఉద్యోగుల్లో టెర్రర్‌ పుట్టించడం మరో ఎత్తుగడ. నిమ్మగడ్డ రాష్ట్రం తన గుప్పిట్లో ఉందనే భ్రమలో ఉన్నారు. ఎల్లో మీడియా ద్వారా అదే ప్రచారం చేస్తున్నారు. ఎస్‌ఈసీ బెదిరింపులను ఉద్యోగులు లెక్క చేయాల్సిన అవసరమే లేదు. ఉద్యోగులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుంది. నిమ్మగడ్డ ప్రభుత్వానికి రాసిన లేఖలన్నీ అబద్ధాలు, అసత్యాలే. సుప్రీంకోర్టు తీర్పు రాగానే  చీఫ్‌ సెక్రటరీకి కమిషన్‌ ఓ లేఖ రాసింది. అందులో ఇద్దరు కలెక్టర్లు, ఒక ఎస్పీని ఉద్దేశిస్తూ వాడిన భాష కూడా సక్రమంగా రాయలేదు. వాళ్లపై రిమార్క్‌ పెట్టేలా రాసింది.

పంచాయతీరాజ్‌ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, గిరిజాశంకర్‌లను మార్చమని కమిషన్‌ చేసిన సిఫార్సులను ప్రభుత్వం అంగీకరించింది. వేరే అధికారుల పేర్లు కూడా పంపింది. కానీ.. మాకు సంబంధం లేదు, మీరు కావాలంటే బదిలీ చేసుకోమంది కమిషన్‌. అసభ్యకరమైన భాషలో, తన పరిధిలో లేనివి అన్నీ ఇద్దరు ఐఏఎస్‌లకు అంటగడుతూ లేఖ రాయటం ఏంటి? ముందు అన్నమాటకు కట్టుబడి ప్రభుత్వాన్ని కోరితే సరిపోయేది. ఎన్నికల విధుల్లో భాగంగా ట్రాన్స్‌ఫర్, సస్పెండ్‌ చేసే అధికారాలు ఎస్‌ఈసీకి ఉన్నాయి. అంతే తప్ప సర్వీస్‌ రిజిస్టర్‌లో చేర్చమని డీవోపీటీకి రాయటం, వీళ్లు ఆఫీసర్లుగా పనికిరారు అనటం నిమ్మగడ్డ అహంభావం. నిమ్మగడ్డ ప్రొసీడింగ్స్‌ను తిరస్కరిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేస్తుంది. అధికారులపై డీవోపీటీకి రాసినదాన్ని గుర్తించదు.

అధికారులపై దాడి వెనుక కుట్ర
అధికారులపై నిమ్మగడ్డ దాడి చేయడం వెనుక కుట్ర కోణం ఉంది. ఏ సంవత్సరంలో ఎన్నికలు జరిగినా ఆ ఏడాది జనవరి ఒకటినాటికి ఓటింగ్‌ అర్హతగా తీసుకోవాలని 1994 పంచాయతీరాజ్‌ చట్టం చెబుతోంది. ఓటర్ల జాబితా తయారు చేయాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 16వ తేదీన ఎన్నికల రోల్స్‌ అడిగి తీసుకుని, వాటిని గ్రామాల ప్రకారం విభజించి, ఓటర్ల జాబితాలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఎన్నికలకు వెళ్లాలి. ఈ ప్రక్రియకు రెండునెలల సమయం పడుతుంది. ఈలోగా నిమ్మగడ్డ పదవీకాలం ముగుస్తుంది. ఓటర్ల జాబితా సిద్ధమైనా, తమకు ఓటు హక్కు ఇవ్వలేదనే అంశాన్ని ఎవరైనా కోర్టులో నిలదీసే వీలుంది. దీన్ని తప్పించుకోవడానికే నిమ్మగడ్డ ఇద్దరు అధికారులను బలి చేస్తున్నారు. 2019 ఓటర్ల జాబితా ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు.

ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది
నిమ్మగడ్డ వ్యవహార శైలిని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంటోంది. తన పరిధి దాటి అధికారులపై ఆయన చేసిన ప్రొసీడింగ్స్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం ప్రొసీడింగ్స్‌ ఇస్తుంది. భవిష్యత్‌లోనూ ఎన్నికల కమిషన్‌ ఇచ్చే అడ్డగోలు ఉత్తర్వుల్ని పట్టించుకోదు. కమిషన్‌ సిఫార్సులు మాత్రమే చేయాలి. నిర్ణయాలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అధికారులను కొంతకాలం సస్పెండ్‌ చేసే అధికారం మాత్రమే కమిషన్‌కు ఉంటుంది. కానీ నిమ్మగడ్డ తన పరిధి దాటారు. ప్రభుత్వం తన అధికారులను రక్షించుకోవడంలో ముందుంటుంది. ఇకముందు కూడా నిమ్మగడ్డ జారీచేసే అడ్డగోలు ఆదేశాలకు ఎవరూ భయపడొద్దు. అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయండి. ఏ పార్టీ గురించీ పట్టించుకోవద్దు.

మీ పరిధిలో అధికారాలు ఉపయోగించి గ్రామాల్లో గొడవలు రాకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేట్టు చూడండి. మహా అయితే కొద్దిరోజుల పాటు డ్యూటీల నుంచి ఎస్‌ఈసీ మిమ్మల్ని పక్కన పెడుతుందేమో కానీ అంతకుమించి ఏమీ చేయలేదు. గోపాలకృష్ణ ద్వివేది  కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పనిచేసినప్పుడు.. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఆయన చాంబర్‌లోకి వెళ్లి ఎన్నికల కమిషన్‌ అంత పెద్దది అనుకుంటున్నారా అని మాట్లాడారు. అదే చంద్రబాబు ఈరోజు దైవదూషణలా.. ఎన్నికల కమిషన్‌ను దూషిస్తారా అని అంటున్నాడు. అప్పుడు చంద్రబాబు అటాక్‌ చేస్తే.. ఇప్పుడు సహపాత్రధారి నిమ్మగడ్డ కూడా ద్వివేదిని అటాక్‌ చేస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement