దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, తదితరులు
సాక్షి, అమరావతి: నమ్ముకున్న జనం కోసం ఎంత దూరమైనా పోరాడే తత్వం గల మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని, మాట మీద నిలబడే మనిషిగా ఆయన పేరు తెచ్చుకున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రభుత్వ వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సరిగ్గా అదే స్ఫూర్తితో ఆయన కుమారుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వైఎస్సార్ 11వ వర్ధంతి సభలో ఆయన మాట్లాడుతూ..
► తెలుగు వారందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి పోయేలా అభివృద్ధి–సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన మహావ్యక్తి వైఎస్సార్ అన్నారు. సజ్జల ఇంకా ఏమన్నారంటే..
► వైఎస్సార్ మరణించి 11 ఏళ్లు పూర్తయ్యాయి. ఆయన కోసం పరితపిస్తూ ఎన్నో గుండెలు ఆగిపోయాయి. ఆయన్ను గుర్తు చేసుకుంటే చాలు అందరి కళ్లూ చెమరుస్తాయి.
► బహుశా ఆధునిక చరిత్రలో ఇంతగా వ్యవస్థను ప్రభావితం చేసి, కోట్లాది మంది ప్రజల అభిమానం చూరగొన్న వ్యక్తి మరొకరు లేరు. ఆయన జీవితం నేడు రాజకీయాల్లో ఎందరికో ఆదర్శం. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో వైఎస్సార్ రాణించారు.
► వైఎస్సార్ అందించిన పరిపాలన, ఆయన వ్యక్తిత్వం లక్షలాది మందిని కార్యకర్తలుగా చేస్తే, అదే రీతిన నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్‌ప్రజా జీవితంలో తీసుకున్న సంచలన నిర్ణయాలు, వైఎస్సార్‌సీపీ స్థాపన, సుదీర్ఘ పాదయాత్ర, 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లను గెలుపొందడం.. ఇదంతా ఒక చరిత్ర.
► వైఎస్సార్ జీవితం, ఆయన పరిపాలనే సిద్ధాంతంగా ఆయన ఆలోచనలే మార్గదర్శకాలుగా వాటిని మరింత గొప్పగా ముందుకు తీసుకు పోయేందుకు ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆ మహానేతకు మరణం లేదు. అందరం ఆయన అడుగుజాడల్లో నడవాలి. సీఎం జగన్ చేస్తున్న ప్రయత్నాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
► విజయవాడలోని కంట్రోల్ రూం వద్ద ఉన్న వైఎస్సార్ పార్క్‌లో రాజశేఖరరెడ్డి 11వ వర్ధంతి నిర్వహించారు. వైఎస్సార్ కాంస్య విగ్రహానికి రాష్ట్ర మంత్రులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
► విశాఖలో జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, మాధవి, ఎమ్మెల్యే అదీప్‌రాజ్ తదితరులు వైఎస్‌కు నివాళులర్పించారు.
మంత్రులు, నేతల ఘన నివాళి
► అంతకు ముందు పార్టీ కార్యాలయంలో సజ్జలతో సహా ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, వెలంపల్లి శ్రీనివాస్, గుమ్మనూరు జయరాం, ఎంపీలు నందిగం సురేష్, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు.
► కార్యాలయం కూడలిలో ఉన్న వైఎస్సార్ నిలువెత్తు విగ్రహానికి ముఖ్య నేతలంతా పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. మంత్రులు పేద మహిళలకు దుస్తులు పంపిణీ చేశారు. కేంద్ర కార్యాలయ వ్యవహారాల పర్యవేక్షకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment