న్యూఢిల్లీ: 2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని నరేంద్ర మోదీ తదితరులకు సిట్ ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సుప్రీంకోర్టు సమర్థించడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్వాగతించారు. ‘‘గరళాన్ని కంఠంలో దాచుకున్న శివునిలా మోదీ కూడా ఆ తప్పుడు ఆరోపణల తాలూకు బాధను 19 ఏళ్లపాటు మౌనంగా దిగమింగారు. పుటం పెట్టిన బంగారంలా ఎట్టకేలకు నిజం నిగ్గుదేలింది. అందుకెంతో ఆనందంగా ఉంది’’ అన్నారు.
రాజకీయ కారణాలతో మోదీపై తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్లంతా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శనివారం ఏఎన్‌ఐ వార్తా సంస్థకు అమిత్ షా ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘నేను కావాలనుకుంటే ఈ ఇంటర్వ్యూను 2003లో గుజరాత్ హోం మంత్రిగా ఉన్నప్పుడే, లేదంటే ఆ తర్వాత బీజేపీ అధ్యక్షునిగా ఉన్నప్పుడే ఇచ్చి ఉండేవాణ్ని. కానీ మోదీ మాత్రం తానే తప్పూ చేయకపోయినా ఆ ఉదంతంపై సాగుతున్న న్యాయ ప్రక్రియను ప్రభావితం చేయొద్దని భావించారు. ఆ కారణంతోనే దానిపై ఇన్నేళ్లుగా ఒక్క మాటా మాట్లాడలేదు. తప్పుడు ఆరోపణలన్నింటినీ మౌనంగా భరించారు.
ఎంతో గుండె దిటవుంటే గానీ ఇది సాధ్యం కాదు. ఆ క్రమంలో ఆయన బాధను అనుభవించిన తీరును నేను దగ్గరినుంచి చూశా’’ అని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో రాజకీయాల్లో ఉన్నవాళ్లు రాజ్యాంగాన్ని ఎలా గౌరవించాలో సిట్ విచారణ సందర్భంగా మోదీ స్వయంగా ఆచరించి చూపించారన్నారు. విచారణను వ్యతిరేకిస్తూ ఆయన ఎలాంటి ప్రదర్శనలకూ దిగలేదని గుర్తు చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించిన సందర్భంగా ఆయన నేతృత్వంలో పార్టీ రోజుల తరబడి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేయడం తెలిసిందే. వాటిని ఉద్దేశించి షా ఈ వ్యాఖ్యలు చేశారు.
కోర్టు తీర్పు స్పష్టంగా ఉంది
‘‘ఈ అంశంపై మేం చర్చ చేపట్టవచ్చు. కానీ, ఆపని చేయలేదు. ఎందుకంటే ఇందులో దాచేందుకు ఏమీలేదు. ఇప్పుడు దీనిపై కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఒక పోలీసు అధికారి, ఒక ఎన్జీవో, కొన్ని రాజకీయ శక్తుల పేర్లు కూడా ఈ తీర్పులో ప్రస్తావనకు వచ్చాయి. తీర్పులో తీస్తా సెతల్వాద్ పేరు స్పష్టంగా ఉంది. ఎన్జీవోను ఆమె నడుపుతున్నారు. ఈ త్రయమే సంచలనాలు సృష్టించేందుకు అసత్యాలు ప్రచారం చేసి, తప్పుడు సాక్ష్యాలు చూపించినట్లు తేలింది. సిట్‌కు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చినట్లు కోర్టు స్పష్టం చేసింది. అల్లర్లను ఆపేందుకు అప్పటి ప్రభుత్వం శతథా ప్రయత్నించినట్లు తెలిపింది.
సీఎంగా ఉన్న మోదీ శాంతి నెలకొనాలని పదేపదే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైలు దహనం ఘటన అనంతరం అల్లర్లు ప్రణాళిక ప్రకారం జరిగినవి కాదని న్యాయస్థానం స్పష్టం చేసింది’’ అని అమిత్ షా చెప్పారు. అల్లర్లను ఆపేందుకు అప్పటి గుజరాత్ సీఎంగా మోదీ ఏం చేశారన్న ప్రశ్నకు అమిత్ షా..‘‘హింసను నివారించడంలో గుజరాత్ ప్రభుత్వం ఎటువంటి జాప్యం చేయలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కాల్పులు కూడా జరిపారు’’ అని తెలిపారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో హోం, న్యాయ, ఎక్సైజ్ తదితర శాఖలకు మంత్రిగా అమిత్ షా వ్యవహరించారు.
మోదీ విజయమిది
‘‘అల్లర్లకు సంబంధించి మోదీపై కేసులు ఎందుకు పెట్టారో కూడా సుప్రీంకోర్టు తన తీర్పుతో బట్టబయలు చేసింది. మా నేతపై మోపినవన్నీ తప్పుడు ఆరోపణలంటూ కొట్టిపారేసింది. బీజేపీ కార్యకర్తలందరికీ ఈ తీర్పు గర్వకారణమైంది. చాలా ప్రాధాన్యమున్న తీర్పిది’’అని షా అన్నారు. ‘‘ప్రభుత్వం పరిస్థితిని వెంటనే అదుపు చేయడంతో తక్కువ నష్టం జరిగింది. సాక్షుల భద్రతకు సరైన చర్యలు తీసుకుంది. శాంతిని స్థాపించేందుకు మోదీ పలు సమావేశాలు జరిపారని కోర్టు తెలిపింది’’ అని అమిత్ షా అన్నారు. ‘‘నేడు సత్యం గెలిచింది. మోదీ విజయం సాధించారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘సిట్ కోసం కోర్టు ఆదేశాలివ్వలేదు. ఒక ఎన్జీవో సిట్ వేయాలని డిమాండ్ చేయగా కోర్టు ప్రభుత్వం అభిప్రాయం కోరింది. ప్రభుత్వం అభ్యంతరం లేదనడంతో సిట్ ఏర్పాటైంది. రికార్డుల్లో ఇదే విషయం ఉంది. కోర్టు చెప్పింది కూడా ఇదే. సిట్‌లోని అధికారులు కూడా ఇతర రాష్ట్రాల వారే. ఆ సమయంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది’’ అని ఆయన అన్నారు.
#WATCH LIVE | HM Amit Shah breaks his silence on what happened during the 2002 Gujarat riots. An interview with ANI Editor Smita Prakash. https://t.co/qkX9eAYeG6
— ANI (@ANI) June 25, 2022
Comments
Please login to add a commentAdd a comment