సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్‌ఎస్, బీజేపీ ఒకటి కాదనే ప్రచారాన్ని సమర్థవంతంగా గట్టిగా తిప్పికొట్టండి.. ఈ రెండు పార్టీలు ఎప్పుడూ ఒకటి కావు..కాబోవు అనే విషయాన్ని విడమర్చి చెప్పండి. బీఆర్‌ఎస్‌తో బీజేపీకి గతంలోనూ ఎలాంటి ఒప్పందాలు లేని విషయాన్ని, బీఆర్‌ఎస్ మన ప్రధాన శత్రువు అని చాటండి. గతంలో చోటుచేసుకున్న పరిణామాలను, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి దాదాపు ఇరవై ఏళ్లుగా వివిధ సందర్భాల్లో కలిసి సాగుతున్న విషయాన్ని ఎండగట్టండి. ఎవరో ఏదో అంటున్నారని, బీజేపీపై దు్రష్పచారం చేస్తున్నారని మా దృష్టికి తీసుకొచ్చే ముందు క్షేత్రస్థాయిలో ఆ ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టండి.
ప్రజలకు వాస్తవాలు వివరించి మద్దతు కూడగట్టండి. పార్టీ వ్యతిరేక ప్రచారాన్ని సమష్టిగా ఎదుర్కోండి..’అంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర నేతలకు క్లాస్ తీసుకున్నారు. ‘ఎన్నికల సమరంలోకి దిగి అన్ని సవాళ్లను ఎదుర్కోండి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందేందుకు ఉమ్మడిగా కృషి చేయండి. ఏ సమస్యలున్నా మీకు అండగా నిలుస్తాం. పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. మీరంతా సీనియర్ నేతలు. రాజకీయాల్లో ఎలా వ్యవహరించాలో మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఎదుర్కొనేలా కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకు సాగండి..’అని చెప్పారు.
నగరంలోని నోవాటెల్ హోటల్లో ఆదివారం రాత్రి పొద్దు పోయేదాకా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో నడ్డా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్లమెంటరీబోర్డు సభ్యుడు డా.కె.లక్ష్మణ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకరరెడ్డి, జాతీయ కార్యవర్గసభ్యులు విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, గరికపాటి మోహన్‌రావు పాల్గొన్నారు.
లీకులిస్తే ఉపేక్షించేది లేదు..
వివిధ స్థాయిల్లోని నేతలు గత కొంతకాలంగా మీడియా చిట్‌చాట్‌ల పేరిట, లీకులతో జరిపిన వ్యవహారం పార్టీకి నష్టం చేసిందని, ఇకపై ఎవరూ ఇలాంటి కార్యకలాపాలకు పాల్పొడొద్దని నడ్డా హెచ్చరించినట్టు సమాచారం. ‘పార్టీ క్రమశిక్షణను ఎవరూ ఉల్లంఘించకూడదు. ఇదే పద్ధతి కొనసాగిస్తే కఠిన చర్యలు ఉంటాయ్’అని అన్నట్టు తెలిసింది.
కర్ణాటకలో పార్టీకి ప్రజల్లో మద్దతున్నా, పార్టీ నాయకులు, ముఖ్యనేతల మధ్య సమన్వయం లేకపోవడం, విభేదాలు రోడ్డెక్కడంతో ప్రజల తిరస్కారానికి గురికావాల్సి వచ్చిందని వివరించినట్టు తెలిసింది. తెలంగాణలో కర్ణాటక పరిస్థితి ఎదురుకాకుండా పార్టీ నేతలంతా సమన్వయంతో కలిసికట్టుగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేసినట్లు పార్టీవర్గాలు తెలిపాయి.
‘పార్టీ లైన్ దాటొద్దు..నోరు జారొద్దు..క్రమశిక్షణను ఉల్లంఘించొద్దు...పార్టీ కేడర్‌లో విశ్వాసం, నమ్మకం నింపండి. పూర్తి విశ్వాసంతో ముందుకు సాగండి..’అని సూచించినట్లు వెల్లడించాయి. రాత్రి నోవాటెల్‌లోనే బసచేసిన నడ్డా, సోమవారం ఉదయం ఢిల్లీకి తిరిగి వెళ్లనున్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వంద రోజుల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించినట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment