మంత్రి సీతక్కను కలసి అభినందనలు తెలియజేస్తున్న ఆర్.కృష్ణయ్య, ఇతర బీసీ నేతలు
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖలను తనకు కేటాయించడంపట్ల మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సీతక్క మాట్లాడుతూ.. తనకు మంచి శాఖలను కేటాయించారని, గ్రామస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. సర్పంచ్‌ల సమస్యలపై దృష్టి సారిస్తామని తెలిపారు.
తండాలను పంచాయతీలుగా చేసినా వాటి అభివృద్ధికి గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, అడవి బిడ్డగా గిరిజన, ఆదివాసీ తెగలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాగా, మంత్రి సీతక్కను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో పలువురు బీసీ నేతలు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. బీసీల సమస్యలు పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నేత నీరడి భూపేష్ సాగర్, నీలం వెంకటేష్, వేముల రామకృష్ణ, నిఖిల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment