panchayat raj department minister
-
మంచి శాఖలు కేటాయించారు, ప్రజలకు సేవచేస్తా..
సాక్షి, హైదరాబాద్/కాచిగూడ: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖలను తనకు కేటాయించడంపట్ల మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) సంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో సీతక్క మాట్లాడుతూ.. తనకు మంచి శాఖలను కేటాయించారని, గ్రామస్థాయిలో ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. సర్పంచ్ల సమస్యలపై దృష్టి సారిస్తామని తెలిపారు. తండాలను పంచాయతీలుగా చేసినా వాటి అభివృద్ధికి గత ప్రభుత్వం నిధులు కేటాయించలేదని, అడవి బిడ్డగా గిరిజన, ఆదివాసీ తెగలకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాగా, మంత్రి సీతక్కను జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య నేతృత్వంలో పలువురు బీసీ నేతలు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. బీసీల సమస్యలు పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నేత నీరడి భూపేష్ సాగర్, నీలం వెంకటేష్, వేముల రామకృష్ణ, నిఖిల్ పాల్గొన్నారు. -
ఉత్సవాలను విజయవంతం చేయండి
నర్సీపట్నం టౌన్: పౌర సమాచార ఉత్సవ ఫలితాలు ప్రజలకు చేరినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. స్థానిక పోలీసు గ్రౌండ్స్‌లో పౌర సమాచార ఉత్సవ ఏర్పాట్లను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజాప్రతినిధులంతా పాల్గొని ఉత్సవాన్ని విజయవంతం చేయాలని కోరారు. పథకాలపై అవగాహన పొందేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయన్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందించేందుకు వీలుగా స్టాల్స్ ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. ఉత్సవాలను స్పీకర్ కోడెల శివప్రసాదరావు ప్రారంభిస్తారని చెప్పారు. పట్టణంలో రూ.1.5కోట్లతో నిర్మించిన గిరిజన కళాశాల వసతి గృహాన్ని ఆయన చేతులమీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు జిల్లాలోని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రి పూసపాటి ఆశోక్‌గజపతిరాజు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విచ్చేస్తున్నట్లు తెలిపారు. ఉత్సవంలో అలరించేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని జిల్లా అధికారులను ఆదేశించామన్నారు. శనివారం నుంచి 24 వరకు జరిగే ఉత్సవాలను అధికారులంతా సమన్వయంతో పనిచేసి విజయవంతం చేసి, నర్సీపట్నానికి గుర్తింపు తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్, పీఐబీ అధికారి రెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్, డ్వామా పీడీ శ్రీరాములనాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతకాయల సన్యాసిపాత్రుడు పాల్గొన్నారు. ఏర్పాట్లు పూర్తి నర్సీపట్నం టౌన్: నర్సీపట్నంలో జన సూచన అభియాన్ పౌర సమాచార ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర పౌర సమాచార శాఖ అధికారి రెడ్డి పర్యవేక్షణలో స్టాల్స్ ఏర్పాటుకు అందంగా వేదికను తీర్చిదిద్దారు. శాఖల వారీగా అధికారులు పథకాలకు సంబంధించి నమూనాలను ఏర్పాటుచేశారు. వీటిని మంత్రి అయ్యన్నపాత్రుడు, జేసీ ప్రవీణ్‌కుమార్ శుక్రవారం పరిశీలించారు. ఉత్సవం విశిష్టతను ప్రజలకు తెలియజేసేందుకు ప్రారంభానికి ముందు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు పీఐబీ అధికారి రెడ్డి మంత్రికి వివరించారు. వారి వెంట ఆర్డీవో సూర్యారావు, జిల్లా అధికారులు ఉన్నారు.