
సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు తెరపైకి కొత్త ముఖాలు వస్తున్నాయి. ఈసారి ఎంపీలుగా పోటీచేసే జాబితాలో పలువురు మంత్రుల కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయి. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని తనకు ఖమ్మం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ ఆమె గురువారం గాందీభవన్‌లో దరఖాస్తు సమర్పించారు. కాగా, ఇదే సీటుకు మరో సీనియర్ నేత మాజీ ఎంపీ వి.హనుమంతరావు కూడా దరఖాస్తు చేయడం గమనార్హం. ఈ స్థానంలో ఆయన పోటీ చేస్తారనే చర్చ చాలాకాలంగా జరుగుతోంది.
ఇదే సీటు కోసం కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, మరో రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌లు కూడా పోటీలో ఉన్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్ నుంచి బరిలో ఉంటారనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ హాట్‌సీటుగా మారిందనే చెప్పవచ్చు.
రెండోరోజు 34 మంది దరఖాస్తు
రెండోరోజు 34 మంది దరఖాస్తులు సమర్పించారు. ఆయా పార్లమెంట్ స్థానాల వారీగా చూస్తే మహబూబాబాద్‌కు 9, నాగర్‌కర్నూల్‌కు 8, వరంగల్‌కు 6, భువనగిరికి 6, ఖమ్మంకు 2, నిజామాబాద్‌కు 3 దరఖాçస్తులు వచ్చాయి. భువనగిరి సీటుకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు ఉస్మానియా విద్యారి్థనేత, టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్‌గౌడ్ దరఖాస్తు సమర్పించారు. నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత దరఖాస్తు అందజేశారు. మొత్తంగా చూస్తే ఇప్పటివరకు 41 మంది దరఖాస్తు చేశారు. కాగా ఈనెల 3వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు గడువు ఉండటంతో శుక్ర, శనివారాల్లో భారీగా దరఖాస్తులు వస్తాయని గాం«దీభవన్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment