సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల నియోజకవర్గం పచ్చపార్టీలో వర్గ విబేధాలు భగ్గుమంటున్నాయి. ఆ పార్టీలోని చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన నేతలు రెచ్చిపోతున్నారు. సొంత పార్టీలోని బీసీ, ఎస్సీ నేతలనే లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు.
బాపట్లలో ఇటీవల టీడీపీలోని యాదవ నేతలపై ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వేగేశన నరేంద్రవర్మతోపాటు కమ్మ సామాజికవర్గానికి చెందిన ఐటీడీపీ నేత దాడులకు తెగబడ్డారు. ఏకంగా పార్టీ కార్యాలయంలో దాడి చేసి గాయపరిచారు. ఈ సంఘటనను బీసీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న నరేంద్రవర్మ కమ్మ నేతలకు వంత పాడటంతో బీసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దాడికి ఆజ్యం ఇక్కడే..
ఇటీవల తమకు రావాల్సిన డేకరేషన్‌కు సంబంధించి యాదవ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ నాయకుడి కుమారుడు మద్దిబోయిన రాంబాబు డబ్బులు అడిగాడు. దీంతో కోపోద్రేకులైన నరేంద్రవర్మతోపాటు ఆయన తనయుడు రాకేష్‌వర్మలు కలిసి పార్టీ కార్యాలయంలో రాంబాబుపై దాడికి పాల్పడ్డారు. దీనిపై నరేంద్రవర్మ ఆయన తనయుడిపై పోలీసు కేసు నమోదైంది. తాజాగా శనివారం కమ్మ సామాజికవర్గానికి చెందిన ఐ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు మానం శ్రీనివాసరావు యాదవ సామాజికవర్గానికి చెందిన పట్టణ అధ్యక్షుడు గొలపల శ్రీనివాసరావుపై దాడికి పాల్పడ్డారు. ఈ సంఘటన టీడీపీ సమావేశంలోనే జరిగింది.
ఐటీడీపీ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించకపోవడంతోపాటు టీడీపీ అభివృద్ధి కోసం పనిచేయడం లేదని గొలపలి శ్రీనివాసరావు ప్రశ్నించడంతో దాన్ని జీర్ణించుకోలేని మానం శ్రీనివాసరావు ఆగ్రహించి దాడికి తెగబడ్డాడు. దీంతో నేతలు రెండు వర్గాలుగా విడిపోయి బాహాబాహీకి దిగారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడిపైనే కమ్మ సామాజికవర్గం నేత దాడికి దిగడాన్ని ఆ సామాజికవర్గం జీర్ణించుకోలేక పోతోంది.
రగిలిపోతున్న బీసీలు
అటు వర్మ సామాజిక వర్గం... ఇటు కమ్మ సామాజికవర్గం నేతలు సొంతపార్టీ యాదవులపై వరుస దాడులకు దిగడంతో వారు రగిలిపోతున్నారు. ఈ వ్యవహారంపై నియోజకవర్గంతోపాటు జిల్లా వ్యాప్తంగా బీసీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ అధ్యక్షుడిపై దాడి జరిగిన మరుక్షణమే యాదవ నేతలతోపాటు, బీసీ కులాల నేతలు సమావేశమై కమ్మ నేతల దాడిని ఖండించారు.
ఓట్ల పరంగానూ బాపట్ల నియోజకవర్గంలో 20 వేలకు పైగా యాదవ సామాజికవర్గం ఓట్లు ఉండగా చాలా గ్రామాల్లో వారి ఆధిపత్యం ఉంది. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఉన్న వర్మ క్షత్రియ సామాజిక వర్గానికి 3వేల ఓట్లు, కమ్మ సామాజికవర్గం ఓట్లు 9వేల లోపే ఉన్నాయి. అయినా తమనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారని బీసీలు మండిపడుతున్నారు.
గతంలో ఎస్సీలపైనా దాడులు
గతంలో ఎస్సీ నేతలపైనా టీడీపీ నేతలు దాడులు చేసిన సంఘటనలు ఉన్నాయి. ఆ పార్టీ పట్టణ అధ్యక్షుడిగా పనిచేసిన ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తానికొండ దయాబాబుపై కమ్మ సామాజికవర్గానికిచెందిన ఇనగంటి శ్రీనివాసరావు పార్టీ కార్యాలయంలోనే దాడిచేశారు.
అయినా ఆ నేతకు వర్మ మద్దతు పలకడమే కాకుండా బాధితుడైన దయాబాబును పార్టీ పట్టణ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. దీంతో ఎస్సీ సామాజికవర్గం నేతలు కూడా నరేంద్రవర్మతీరుపై ఆగ్రహంతో ఉన్నారు. ఎస్సీలు, బీసీలు వచ్చే ఎన్నికల వేదికగా వారిపై క్షక్ష తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment