తిరువనంతపురం: కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ పోటీ చేస్తారని ఊహాగానాలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే వీటిపై ఆయన స్పందించారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని పేర్కొన్నారు. మూడు వారాల్లో దీనిపై స్పష్టత ఇస్తానని తెలిపారు. ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేనన్నారు.
తాను పోటీ చేసేది లేనిదీ చెప్పకపోయినా ఒక్క విషయం మాత్రం కచ్చితంగా చెప్పగలనని థరూర్ అన్నారు. ప్రజాస్వామ్య పార్టీలో ఎన్నికలు నిర్వహించడం ఎప్పుడైనా శుభపరిణామమే అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయట్లేదని గాంధీ కుటుంబం ఇప్పటికే స్పష్టం చేసిందని థరూర్ పేర్కొన్నారు. గాంధీయేతరులు కాంగ్రెస్ అధ్యక్షులైతే మంచిదన్నారు.
అక్టోబర్‌లో జరిగే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో గాంధీ కుంటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోయినా, వాళ్ల తరఫున రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లేత్ నిలబడినా శశి థరూర్ బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. ఇటీవల ఓ వార్తా పత్రికకు రాసిన సంపాదకీయంలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలని థరూర్ పేర్కొనడం వీటికి బలం చేకూర్చింది. అంతేకాదు నామినేషన్లు కాకుండా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకునేందుకు కూడా ఎన్నికలు జరగాలని థరూర్ సూచించారు.
ఎవరైనా పోటీ చేయొచ్చు..
భారత్ జోడో యాత్ర ప్రచారంలో భాగంగా కేరళలో పర్యటిస్తున్న ఏఐసీసీ నేత జైరాం రమేశ్ థరూర్ వ్యాఖ్యలపై స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించామని, ఎవరైనా పోటీ చేయవచ్చని స్పష్టం చేశారు. అక్టోబర్ 17న కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడు ఎవరో తేలిపోతుందని చెప్పారు.
చదవండి: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు షెడ్యూల్ విడుదల
Comments
Please login to add a commentAdd a comment