చిత్తూరు జిల్లా కార్వేటినగరంలో సర్పంచ్‌గా గెలుపొంది ధ్రువీకరణ పత్రం అందుకుంటున్న వైఎస్సార్‌సీపీ మద్దతుదారు ధనుంజయ వర్మ
సాక్షి, అమరావతి సాక్షి ప్రతినిధి, తిరుపతి: ఏపీ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఎన్నికలు జరిగిన పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతిస్తున్న అభ్యర్థులు ఏమాత్రం ప్రభావం చూపలేక చతికిలపడ్డారు. పది శాతం పంచాయతీల్లో కూడా ఆ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలవలేకపోయారు. ఎన్నికలు జరిగిన 12 జిల్లాలోనూ వైఎస్సార్‌సీపీ మద్దతిచ్చిన అభ్యర్థులు ఏకపక్షంగా గెలుపొందడంతో టీడీపీ నాయకులు నిస్తేజంలో మునిగిపోయారు.
పార్టీ రహిత ఎన్నికలకు మేనిఫెస్టో విడుదల చేసి కాలుదువ్విన చంద్రబాబు చివరికి పరువు కూడా దక్కించుకోలేక అభాసుపాలయ్యారు. ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేసి, దౌర్జన్యాలు, దాడులు చేస్తున్నారని ఆరోపించి నానా హడావుడి చేసినా ప్రజలు మాత్రం పట్టించుకోలేదు. రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందనే ప్రచారంతో ఇష్టానుసారం ఆరోపణలు చేస్తూ ప్రజలను ఏమార్చాలని చూసినా సాధారణ ఎన్నికల ఫలితాలే ఇక్కడా కనిపించడంతో ఆ పార్టీ నేతలు కంగుతిన్నారు.
ఒక్కసారిగా నేతలు సైలెంట్
తమ పార్టీ నేతలను వైఎస్సార్‌సీపీ నాయకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని అదే పనిగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అక్కడక్కడా స్థానికంగా జరిగే చిన్నపాటి వివాదాలను పెద్దవిగా చేసి హడావుడి చేశారు. అయినా, రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ఓట్ల లెక్కింపు మొదలయ్యాక వైఎస్సార్‌సీపీ మద్దతిచ్చిన అభ్యర్థులు ఏకపక్ష విజయంతో దూసుకెళ్తున్నట్లు వార్తలు వస్తుండడంతో టీడీపీ నేతలు సైలెంట్ అయిపోయారు. అవాస్తవాలను హోరెత్తించే ఆ పార్టీ సోషల్ మీడియా ఖాతాలూ మూగబోయాయి. పోలింగ్ ముగిసేవరకూ ఫిర్యాదులతో హడావుడి చేసిన చంద్రబాబు ఫలితాలు రావడం మొదలయ్యాక మిన్నకుండిపోయారు. ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా మీడియాకు దొరక్కుండా వెళ్లిపోయారు.
తామే గెలిచామని మీడియాకు లీకులు
టీడీపీ మద్దతు ఇచ్చిన వారు ఘోర పరాజయం పాలవడంతో రాత్రి 10 గంటలకు తమ పార్టీ 300 పంచాయతీ ఎన్నికల్లో గెలిచినట్లు మీడియాకు లీక్ చేశారు. కొద్దిసేపటికి మంగళగిరి టీడీపీ కార్యాలయంలో దేవినేని ఉమా, అశోక్‌బాబు తదితరులు బాణాసంచా కాల్చి తాము ఎక్కువ స్థానాల్లో గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారు. నిజానికి టీడీపీ అన్ని పంచాయతీల్లో గెలవలేదని క్షేత్రస్థాయి సమాచారం. మిగిలిన మూడు దశల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని.. పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లోనూ భంగపాటు తప్పదని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు భారీ షాక్ తగిలింది. చాలా మండలాల్లో టీడీపీ పత్తా లేకుండాపోయింది. జిల్లాలో మంగళవారం జరిగిన తొలి విడత పోలింగ్‌లో 83.47 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఉదయాన్నే ఓటు వేసేందుకు బారులుతీరారు. జిల్లాలో తొలివిడతలో 454 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్ జారీచేశారు. అందులో 112 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో 106 మంది వైఎస్సార్‌సీపీ అభిమానులు కాగా, కేవలం ఆరుగురు మాత్రమే టీడీపీ మద్దతుదారులు.
Comments
Please login to add a commentAdd a comment