సస్పెండ్‌.. ప్లీజ్‌! | Six TDP members suspended for one day in AP Assembly | Sakshi
Sakshi News home page

సస్పెండ్‌.. ప్లీజ్‌!

Published Thu, Mar 24 2022 4:00 AM | Last Updated on Thu, Mar 24 2022 4:56 AM

Six TDP members suspended for one day in AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి: ‘సస్పెండ్‌ కావాలనుకోవద్దు.. సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోండి..’ అని పదేపదే విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడంతో ఆరుగురు టీడీపీ ఎమ్మెల్సీలపై శాసన మండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు ఒక రోజు పాటు సస్పెన్షన్‌ విధించారు. శాసన మండలి బుధవారం ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు ప్లకార్డులతో వెల్‌లో నిలుచుని నినాదాలతో సభను అడ్డుకున్నారు. టీడీపీ సభ్యులు బిల్లుల ప్రతులను చించివేశారు. ఒకదశలో పోడియం పైకి ఎక్కి చైర్మన్‌ కుర్చీని చుట్టుముట్టారు. వారం రోజులుగా సంయమనం పాటించినా ఫలితం లేకపోవడంతో చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్‌ ప్రకటించారు. తమను మాట్లాడేందుకు అనుమతించాలని లేదంటే సస్పెండ్‌ చేయాలని టీడీపీ సభ్యుడు అశోక్‌బాబు డిమాండ్‌ చేయడంపై శాసన మండలి చైర్మన్‌ విస్మయం వ్యక్తం చేశారు. సస్పెండ్‌ చేయించుకోవటానికే సభకు వచ్చారా? అని ప్రశ్నించారు. వారం రోజులుగా ఒకే అంశంపై పట్టుబట్టి సభను అడ్డుకోవడం సరి కాదన్నారు. విపక్షం సహకరిస్తే ప్రభుత్వం వివరణ ఇస్తుందని పదేపదే విజ్ఞప్తి చేశారు.  

వ్యవసాయంపై చర్చ జరగకుండా.. 
ప్రశ్నోత్తరాలు, ప్రత్యేక ప్రస్తావన సమయాల్లో గందరగోళం సృష్టించిన టీడీపీ సభ్యులు చివరకు వ్యవసాయ రంగంపై స్వల్పకాలిక చర్చను సైతం అడ్డుకున్నారు. కీలకమైన వ్యవసాయ రంగంపై చర్చను సైతం అడ్డుకుంటూ టీడీపీ సభ్యులు దిగజారి వ్యవహరిస్తున్నారని మంత్రి కె.కన్నబాబు విమర్శించారు. ప్రజా సమస్యలు విపక్షానికి పట్టవని మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఏడు రోజులుగా గోవిందా.. గోవిందా అంటూ సభా సమయాన్ని టీడీపీ సభ్యులు వృథా చేశారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. టీడీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని సభ్యులు తుమాటి మాధవరావు, రవివర్మ సూచించారు.

ఆరుగురిపై ఒకరోజు సస్పెన్షన్‌
సభా నిబంధనల ఉల్లంఘన, బిజినెస్‌ రూల్స్‌ అతిక్రమణపై టీడీపీ సభ్యులు బచ్చుల అర్జునుడు, పరుచూరి అశోక్‌బాబు, దీపక్‌రెడ్డి, అంగర రామ్మోహనరావు, దువ్వారపు రామారావు, ఎం.రవీంద్రనాథ్‌లను ఒక రోజు సస్పెండ్‌ చేస్తున్నట్టు మండలి చైర్మన్‌ ప్రకటించారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement