సాక్షి, న్యూఢిల్లీ: శీతాకాల సమావేశాల్లో విపక్షాలకు చెందిన 141 మంది ఎంపీల సస్పెన్షన్ వేటుపై కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ స్పందించారు. ఈ చర్య ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నులిమిందన్నారామె. బుధవారం ఉదయం సెంట్రల్ హాల్లో ఆమె అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ పార్టమెంటరీ సమావేశం జరిగింది.
పార్లమెంట్ ఘటన పరిణామాలు, తదనంతరం రెండు సభల్లో చోటు చేసుకున్న పరిణామాలపై ఈ సందర్భంగా ఆమె సభ్యులతో చర్చించారు. ‘‘సహేతుకమైన, న్యాయబద్ధమైన డిమాండ్ కోసం విపక్షాలు పోరాడుతున్నాయి. కానీ, ఈ ప్రభుత్వం మాత్రం సభ్యుల్ని సస్పెండ్ చేసి ప్రజాస్వామ్యాన్ని గొంతు నులిమి ఖూనీ చేసింది. గతంలో ఎన్నడూ ఇలా జరగలేదు’’ అని అన్నారామె.
డిసెంబర్ 13వ తేదీన జరిగిన అసాధారణ పరిస్థితులపై హోం మంత్రి అమిత్ షా నుంచి వివరణ కోరుతూ ప్రతిపక్షాలు చేస్తున్న విజ్ఞప్తిలో కేంద్రానికి వచ్చిన అభ్యంతరం ఏంటన్నది అర్థం కావడం లేదని అన్నారామె.
తెలంగాణలో విజయంపై శుభాకాంక్షలు: సోనియా
‘‘అసెంబ్లీ ఎన్నికలకు అంకితభావంతో, దృఢ సంకల్పంతో పని చేస్తున్నందుకు తెలంగాణలోని మనపార్టీ సహచరులకు అభినందనలు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలు మనకు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. వారి నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెరవేర్చేందుకు మన శక్తిమేరకు కృషి చేయాలి. ఈ పార్లమెంట్ సెషన్‌లో తెలంగాణలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందడం సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో పొందుపరచింది. దాని గురించి గొప్పగా చెప్పుకునే మోదీ ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చడానికి తొమ్మిది సంవత్సరాల పాటు తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment