రౌడీయిజం, గూండాగిరీ చేసేవారంతా పచ్చ పార్టీలోనే..! | Special Article On TDP Leader Chintamaneni Prabhakar | Sakshi
Sakshi News home page

రౌడీయిజం, గూండాగిరీ చేసేవారంతా పచ్చ పార్టీలోనే..!

Published Sat, May 18 2024 5:56 PM | Last Updated on Sat, May 18 2024 6:40 PM

Special Article On TDP Leader Chintamaneni Prabhakar

కౌరవ సంతతి మొత్తం తెలుగుదేశంలోనే ఉందా? మహిళల మీద దాడులు చేసేవారు, దళితులను నీచంగా చూసేవారు, రౌడీయిజం, గూండాగిరీ చేసేవారంతా పచ్చ పార్టీలోనే సెటిల్ అయ్యారు. ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఓ మాజీ ఎమ్మెల్యే ఇలాంటి నికృష్ట పనులకు కేరాఫ్‌గా నిలిచారు. మహిళా తాహసీల్దార్‌ మీద దాడి నుంచి ఎన్నికల్లో దాడుల వరకు ఆ మాజీ మీద ఎన్నో నేరారోపణలున్నాయి. తాజాగా పోలీస్ స్టేషన్ మీదపడి అరెస్టయిన తన మనిషిని తీసుకెళ్లిపోయేంతగా తెగించాడు. ఇంతకీ ఈ అరాచక పచ్చ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎవరో చూద్దాం.

ఏపీ రాజకీయాల్లో గోదావరి జిల్లాల పేరు చెప్పగానే వెంటనే గుర్తొచ్చే నాయకులు కొందరుంటారు. వారిలో రాజకీయాల్లో మంచి పనులు చేసి ప్రజల మన్ననలు పొందినవారు కొందరైతే.. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, గూండాయిజంతో అందరిపైనా చిందులు తొక్కుతూ వార్తల్లో నిలిచేవాళ్ళు మరికొందరున్నారు. ఏలూరు జిల్లా దెందులూరులోని పచ్చ పార్టీలో ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆయన నేరాల్లో సెంచరీ కొట్టేందుకు తహతహలాడుతున్నాడు. గూండాగిరీతోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆ మాజీ ఎమ్మెల్యే దెందులూరు నుంచి రెండుసార్లు టీడీపీ తరపున గెలిచి తన అధికార అహంకారాన్ని ప్రజలకు చూపించాడు. దీంతో 2019 ఎన్నికల్లో ప్రజలు ఆయనకు గట్టిగా గుణపాఠం చెప్పారు. తాజా ఎన్నికల్లో కూడా ఓటమి తప్పదని అర్థం కావడంతో తన గూండాగిరీతో అటు ప్రజల్ని..ఇటు పోలీసులను కూడా బెదిరించే స్థాయికి చేరాడు చింతమనేని ప్రభాకరచౌదరి.


ఎంపీపీ దగ్గర నుంచి మొదలుపెట్టి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యేంతవరకూ చింతమనేని నేరాలు, దౌర్జన్యాల చిట్టా విప్పితే చాలా పెద్ద లిస్టే ఉంటుంది. దశాబ్దాల రాజకీయ చరిత్రలో చింతమనేని అంటే దెందులూరులో ఒక రౌడీగా గుర్తింపు వచ్చిందే గాని రాజకీయ నాయకుడిగా, ఒక మంచి ప్రజాప్రతినిధిగా పేరు తెచ్చుకోలేకపోయారు.

చింతమనేని దురాగతాలపై పలు కేసులు నమోదు అయినా ఆయన తీరులో మాత్రం ఎలాంటి మార్పు రావట్లేదు. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాతనుంచి మరింత దిగజారి వ్యవహరిస్తున్నారు అనే చర్చ జిల్లాలో జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే చింతమనేని తన నోటి దురుసు, దుడుకుతనంతో నిరంతరం వివాదాల్లో చిక్కుకుంటున్నారు.

2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినపుడు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ తన అక్రమ ఇసుక దందాను అడ్డుకున్నందుకు మహిళా తాహసీల్దార్‌ వనజాక్షిని నదిలో ఇసుకలో ఈడ్చుకుంటూ వెళ్ళి దాడి చేసిన విషయం రాష్ట్రంలో సంచలనం రేపింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభుత్వ అధికారిపై దాడి చేసినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోగా..ఆ తాహసీల్దార్‌నే తప్పుపట్టారు.

ఇక అప్పటినుంచి చింతమనేని అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది. ప్రజల మీద, ప్రత్యర్థుల మీద దాడులు చేయడం, పోలీసులనే బెదిరించడం నిత్యకృత్యంగా మారింది. దళితులంటే ఆయనకు ఎంత చిన్నచూపంటే..మీకు రాజకీయాలెందుకురా? రాజకీయాలు చేస్తే మేమే చేయాలంటూ.. మా బ్రీడ్ వేరు..మా బ్లడ్ వేరని తిక్కగా మాట్లాడే నందమూరి బాలకృష్ణలా అహంకారంతో కూడిన డైలాగ్స్‌ వదిలారు.

ఎన్నికల నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఏలూరు టిడిపి ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏలూరు కలెక్టరేట్ కు వెళ్లిన చింతమనేనిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన చింతమనేని పోలీసులతో ఓవరాక్షన్ చేయవద్దని..అలా చేస్తే ఏం చేయాలో తనకు తెలుసంటూ వారిని బెదిరించాడు. తమను అడ్డుకోవద్దని పోలీసులకు హెచ్చరికలు చేశారు. 

దీంతో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది. చింతమనేని మాటలకు ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులు అయ్యారు. ఎంతకాలం అయినా చింతమనేని ధోరణి మారకపోవడంతో పోలీసులు అతని తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసారు.. 13వ తేదీన పోలింగ్‌ జరుగుతున్నపుడు దెందులూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం..కొప్పులవారిగూడెంలో పంచాయతీ సర్పంచ్ సంజీవరావు కుమారుడు రవిపై  టిడిపి కార్యకర్త రాజశేఖర్ కత్తెరతో దాడి చేశాడు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముద్దాయిపై కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ నుండి కోర్ట్ కు తీసుకువెళ్లే క్రమంలో ముద్దాయిని కస్టడీలో ఉంచారు. 

మూడు వాహనాల్లో పోలీస్ స్టేషన్‌కు వచ్చిన చింతమనేని ప్రభాకర్,  ఆయన అనుచరులు పోలీసులతో ఘర్షణపడ్డారు. సీఐ తోపాటు పోలీస్ స్టేషన్ సిబ్బందిని దుర్భాషలాడుతూ...హత్యాయత్నం చేసి పోలీస్ కస్టడీలో ఉన్న టీడీపీ కార్యకర్తను  చింతమనేని ప్రభాకర్ తన కారులో అక్కడి నుంచి తీసుకుని పరారయ్యాడు. అరెస్టయిని ముద్దాయిని పోలీస్ స్టేషన్‌ నుంచి బలవంతంగా తీసుకెళ్లిన చింతమనేనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్‌పీ స్పష్టం చేశారు.

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర చౌదరిపై కేసుల చిట్టా భారీగా ఉంది. బహుశా రాష్ట్రంలో ఏ పార్టీ అభ్యర్థిపైనా లేనన్ని కేసులు చింతమనేనిపై ఉన్నాయి. రౌడీషీట్ తో పాటు 93 కేసులు తనపై నమోదయ్యాయని చింతమనేని తన ఎన్నికల నామినేషన్ అఫిడవిట్ లో తెలిపారు. తహశీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన ఉదంతం రాష్ట్రం మరచిపోదు. మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్‌పై దాడిచేసిన కేసులో ప్రభాకర్ కు రెండేళ్ళ జైలు శిక్ష పడింది. తాజాగా పెదవేగి పోలీస్ స్టేషన్  విధ్వంసం సృష్టించడంతో మరో కేసు నమోదు అయింది.

తమ బిడ్డపై దాడి చేసిన వ్యక్తిని చింతమనేని దౌర్జన్యంగా స్టేషన్ నుండి తీసుకుపోవడంపై కొప్పులవారి గూడెం సర్పంచ్ సంజీవరావు.. వైఎస్ఆర్సిపి శ్రేణులు పెదవేగి పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని చింతమనేనిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు..లేనపుడు కూడా చింతమనేని ప్రభాకర చౌదరి రౌడీయుజం, గూండాగిరీ ఏమాత్రం ఆగడంలేదు. ఆఖరుకు ఎన్నికల్లో కూడా అహంకారపూరితంగానే వ్యవహరిస్తున్నాడు. శిశుపాలుడు వంద తప్పులు చేసిన తర్వాత శ్రీకృష్ణుడు అతనికి శిరచ్ఛేదం చేశాడు. మరి ఇప్పటికి 93 కేసులు తనపై ఉన్నాయని స్వయంగా చెప్పిన చింతమనేని అహంకారం ఎప్పుడు దిగుతుందా అని దెందులూరు ప్రజలు ఎదురు చూస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement