లబ్ధిదారులకు ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వమనడం తప్పా?
టీడీపీపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం
శ్రేణులను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిక
పింఛన్లపై పల్నాడు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేసిన సీపీఎం నేత రామారావుపై టీడీపీ నేతల దాడి
చికిత్స పొందుతున్న రామారావును పరామర్శించిన శ్రీనివాసరావు
దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్
గుంటూరు/భీమవరం: ‘పింఛన్లపై ఫిర్యాదు చేస్తే దాడి చేస్తారా? ఇళ్ల వద్ద పింఛన్లు ఇవ్వమనడం తప్పా?’ అంటూ టీడీపీ నాయకత్వంపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం పరగటిచర్లలో ఇటీవల లబ్ధిదారులకు ఇళ్ల వద్దే ఇవ్వాల్సిన ఎన్టీఆర్ భరోసా పింఛన్లను.. తమ ఇళ్ల వద్దకు వచ్చి తీసుకోవాలంటూ టీడీపీ నేతలు చాటింపు వేయించారు.
దీనిపై సీపీఎం నాయకుడు కామినేని రామారావు పల్నాడు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కక్ష పెంచుకున్న టీడీపీ నేతలు శుక్రవారం మూకుమ్మడిగా రామారావు ఇంటిపై దాడి చేశారు. వృద్ధురాలైన ఆయన తల్లిని విచక్షణారహితంగా పక్కకు నెట్టేసి.. దాడి చేయడంతో రామారావు తీవ్రంగా గాయç³డ్డారు. స్థానికులు ఆయన్ని నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు శనివారం రామారావును పరామర్శించి మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు.
ఆస్పత్రి నుంచి డీఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి అదనపు ఎస్పీ లక్ష్మీపతికి శ్రీనివాసరావు వినతిపత్రమిచ్చారు. నిందితులను అరెస్ట్ చేయాలని, బాధితుడికి రక్షణ కల్పించాలని కోరారు. శ్రీనివాస రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘టీడీపీ నేతలు 70 ఏళ్ల వయసున్న రామారావుపై దాడి చేయడం దారుణం. అడ్డువచ్చిన ఆయన తల్లి(90)ని కూడా పక్కకు నెట్టేశారు. ఈ దాడిని ఖండిస్తున్నాం. సీఎం చంద్రబాబు వెంటనే స్పందించి తమ పార్టీ వర్గీయులను అదుపులో పెట్టుకోవాలి. దాడులు ఆపకపోతే ఏం చేయాలో మాకు తెలుసు’ అంటూ హెచ్చరించారు.
ప్రత్యేక హోదాపై ఎందుకు ప్రశ్నించట్లేదు?
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడిగే అవకాశమున్నా ఎందుకు జంకుతున్నారని సీఎం చంద్రబాబును శ్రీనివాసరావు ప్రశ్నించారు. శనివారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, విశాఖ ఉక్కు పరిరక్షణ గురించి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అడుగుతారని చంద్రబాబును ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment