సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్‌వర్క్: పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వెనుక బీజేపీ నేతల కుట్రకోణం దాగి ఉందని రాష్ట్ర మంత్రులు ధ్వజమెత్తారు. ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఈ పనికి దిగజారి సూత్రధారిగా వ్యవహరించారని వారంతా మండిపడ్డారు. ఈ ఉదంతంపై మంత్రుల స్పందన వారి మాటల్లోనే..
‘‘ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక కుట్ర కోణం ఉంది. బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దల సూచనలతోనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, అల్లర్లు సృష్టించేందుకు ఈ పనిచేశారు. – సబితారెడ్డి, విద్యాశాఖ మంత్రి
‘‘బండి సంజయ్ టెన్త్ పేపరు లీకేజీ సూత్రధారి. దీనికి అన్ని ఆధారాలున్నాయి. లక్షల మంది పిల్లల భవిష్యత్తుపై కనీస బాధ్యత లేకుండా బండి సంజయ్ వ్యవహరించారు. ఆయన అరెస్టుపై బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేస్తే భౌతికదాడులు తప్పవు’’ – వేముల ప్రశాంత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి
‘‘వివిధ ప్రభుత్వ శాఖల్లో దాగిన బీజేపీ స్లీపర్‌సెల్స్‌ను గుర్తించి బయటికి లాగుతాం. తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు బీజేపీ పన్నిన కుట్రలను ఛేదిస్తాం. తనకు వచ్చిన ప్రశ్నాపత్రంపై పోలీసులకు చెప్పాల్సిన బాధ్యత సంజయ్‌కి లేదా?’’ – గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి
‘‘నిరుద్యోగులు, విద్యార్థులను రెచ్చగొట్టి, రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు బీజేపీ నాయకులు కుట్ర పన్నారు. అడ్డంగా దొరికిపోయిన బండి సంజయ్.. దొంగే ‘దొంగ.. దొంగ’అన్నట్లు మాట్లాడుతున్నారు. బీజేపీ జాతీయ నాయకత్వం సంజయ్‌ను అధ్యక్ష పదవి నుంచి తొలగించి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి’’
– గుంటకండ్ల జగదీష్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
‘‘రాష్ట్రంలో విద్యావ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రలో భాగంగానే లీకేజీ కుట్ర జరిగింది. ఇందుకు బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదు. బండి ఆటలు సాగనివ్వబోం. పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ – కొప్పుల ఈశ్వర్, ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి
‘‘టీఎస్‌పీఎస్సీ, పదో తరగతి పేపర్ లీకేజీ వెనక బీజేపీ నాయకుల కుట్ర ఉంది. తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని చూస్తున్నారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ చేసిన నిందితుడు కూడా బీజేపీ కార్యకర్తే’’ – శ్రీనివాస్‌గౌడ్, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి
‘‘ప్రశ్నపత్రాల లీకేజీ బీజేపీ పనే. పథకం ప్రకారమే ప్రశ్నపత్రం లీకేజీ జరిగింది. బండి నిజాయితీపరుడైతే పోలీసులకు ఫోన్ ఎందుకు ఇవ్వలేదు?. సంజయ్ ఫోన్ సంభాషణ బయటపడితే, లీకేజీలో బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ ప్రమేయం బట్టబయలవుతుంది’’ – ఎర్రబెల్లి దయాకర్‌రావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి
‘‘అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసం బీజేపీ నేతలు ప్రశ్నపత్రాల లీకేజీ వంటి కుట్రలకు పాల్పడుతున్నారు. బండి సంజయ్ పార్లమెంటు సభ్యత్వాన్ని లోక్‌సభ స్పీకర్ తక్షణమే రద్దు చేయాలి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల చర్యలతో రాష్ట్రం భ్రష్టు పడుతోంది.’’ – పువ్వాడ అజయ్‌కుమార్, రవాణా శాఖ మంత్రి
లీకేజీ సూత్రధారి బండి
Published Thu, Apr 6 2023 4:11 AM | Last Updated on Thu, Apr 6 2023 8:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment