న్యూఢిల్లీ: కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 2018లో శివకుమార్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసును దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం కొట్టివేసింది. ఈ కేసులో ఆయనపై విచారణను నిలిపివేయాలని ఈడీని సుప్రీం ఆదేశించింది. డీకే నుంచి రికవరీ చేసిన నగదు మూలాన్ని కనుగొనడంలో దర్యాప్తు సంస్థ విఫలమయ్యిందని పేర్కొంటూ జస్టిస్ అనిరుధ్ బోస్, బేలా ఎం త్రివేదితో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ కేసును కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.
2017లో డీకేతోపాటు అతని సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఈ సోదాల్లో దాదాపు రూ. 300 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అనంతరం ఈ కేసును ఈడీ తన ఆధీనంలోకి తీసుకొని దర్యాప్తు చేపట్టింది. 2018లో డీకేపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 2019లో అతన్ని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది.
అయితే ఆ తర్వాత నెల రోజులకే ఢిల్లీ హైకోర్టు శివకుమార్‌కు బెయిల్ మంజూరు చేసింది. బీజేపీ రాజకీయ కక్ష్యకు పాల్పడుతోందని, న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందని గతంలో శివకుమార్ పేర్కొన్నారు. 2019లో కాంగ్రెస్ నేత కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ జారీ చేసిన సమన్లను కొట్టివేయాలని కోరారు. అక్కడ ఎలాంటి ఉపశమనం లభించకపోవడంతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీనిపై నేడు విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసును కొట్టివేస్తున్నట్లు వెల్లడించింది.
చదవండి: ఎలక్టోరల్ బాండ్లు: మోదీ సర్కారుపై ఖర్గే సంచలన ఆరోపణలు
Comments
Please login to add a commentAdd a comment