ముంబై: బారామతి లోక్‌సభ స్థానం విషయంలో బీజేపీ తమపై కుట్ర చేస్తోందని ఎన్సీపీ(శరద్ చంద్ర పవార్) ఎంపీ సుప్రియా సూలే మండిపడ్డారు. ముఖ్యంగా తన వదిన సునేత్ర పవార్‌ను బారామతి బరిలోకి దించి ఎన్సీపీ( శరద్ చంద్ర పవార్) చీఫ్ శరద్ పవార్ రాజకీయంగా ఉన్న పేరును అంతం చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోందని దుయ్యబట్టారు.
‘నా పోరాటం ఒక వ్యక్తిగా వ్యతిరేకంగా కాదు. వారి(బీజేపీ) ఆలోచనలు, విధానాలుపై మాత్రమే. నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి18 ఏళ్లు అవుతోంది. ఇప్పటివరకు ఒక్క వ్యక్తి కూడా నేను వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు. సునేత్ర పవార్ తను పెద్దన్న భార్య అని.. అంటే తల్లితో సమానం’ అని అన్నారు.
‘బీజేపీవి చెత్త రాజకీయాలు, సునేత్ర పవార్ మా పెద్దన్న భార్య. మరాఠీ కుటుంబంలో అన్న భార్యకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మాకు ఆమె తల్లితో సమానం. మాలో మాకు శత్రుత్వం పెంచడానికి సునేత్రను బారామతి బరిలో దింపుతున్నారు. ఈ నిర్ణయం వెనక బీజేపీ హస్తం ఉంది. ఎన్సీపీ(శరద్ పవార్) చీఫ్ శరద్‌పవార్ పేరును రాజకీయంగా దెబ్బతీయాలని బీజేపీ కుట్ర చేస్తోంది. బారామతి నియోజకవర్గం అభివృద్ధి గురించి బీజేపీ ఆలోచించదు’ అని సుప్రియా సూలే మండిపడ్డారు.
అధికారికంగా బారామతి స్థానంలో మహారాష్ట్ర బీజేపీ కూటమి నుంచి సునేత్ర పవార్‌ను బరిలోకి దింపిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సునేత్ర పవార్ కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ రోజు నాకు చాలా గొప్ప రోజు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ధన్యవాదాలు’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment