
సాక్షి, హైదరాబాద్: ఇటీవలి వర్షాలకు హైదరాబాద్‌లో వేర్వేరు ఘటనల్లో నాలాలో పడి మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర పశు సంవర్థక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్షమాపణ చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగడం తప్పేనని, బాధిత కుటుంబాలను తప్పనిసరిగా ఆదుకుంటామని తెలిపారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం మంత్రి తలసాని మీడియాతో మాట్లాడారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్నందునే కాంగ్రెస్ పార్టీ నాటకాలకు తెరలేపిందని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 150 డివిజన్లలో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకడం కూడా కష్టమేనన్నారు. మంత్రి కేటీఆర్ పనితీరుపై కాంగ్రెస్ నేతల సర్టిఫికేట్లు అవసరం లేదని, ప్రచార యావతోనే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.