
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్ చాలా నిరాశాజనకంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం చెప్పారు. మంగళవారం ఆయన తాడేపల్లిలో మాట్లాడుతూ.. ఆంద్రప్రదేశ్ పట్ల కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపించిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అనేది ఉత్తర భారతీయ జనతా పార్టీగా నిజస్వరూపాన్ని మరోసారి చూపించుకొందని వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాలను మరోసారి వంచించే ప్రయత్నం చేశారన్నారు.
విభజన హామీలు అయిన ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఆంధ్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్లో కేటాయింపులు లేకపోవడాన్ని చూస్తే బీజేపీ ఆంద్రప్రదేశ్‌ని పూర్తిగా విస్మరించినట్లు స్పష్టమైందని అన్నారు. కేంద్రం తీరును ఖండిస్తున్నామన్నారు. కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించడం చాలా దుర్మార్గమని మండిపడ్డారు.
పార్టీలు ఏవయినా అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలని, అప్పుడే కేంద్ర రాష్ట్రాల మధ్య సమైక్య స్పూర్తి వర్ధిల్లుతుందని తెలిపారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కేంద్రం మీద ఒత్తిడి చేసి రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఆంద్రప్రదేశ్‌కు వెంటనే తగిన న్యాయం చేసి, బడ్జెట్లో కేటాయింపులను సరి చేయాలని ఆయన డిమాండ్ చేశారు.